అర్ష్‌దీప్ సింగ్‌కి అండగా సచిన్ టెండూల్కర్... వాళ్లకు అక్కడే సమాధానం చెప్పాలంటూ ట్వీట్...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2022, 6:38 PM IST
Highlights

ఆటలో గెలుపోటములు సహజం... క్రికెట్‌ని వ్యక్తిగత దూషణలకు దూరంగా పెట్టాలంటూ అభిమానులను కోరిన సచిన్ టెండూల్కర్... అర్ష్‌దీప్ సింగ్‌కి బెస్ట్ విషెస్ తెలుపుతూ...

టీమిండియా కీలక మ్యాచుల్లో ఓడిపోతే ఆ కోపాన్ని క్రికెటర్లపైనే చూపిస్తుంటారు అభిమానులు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో టీమిండియా ఓడిన తర్వాత బౌలర్ మహ్మద్ షమీని దూషిస్తూ, బూతులు తిడుతూ పోస్టులు చేసిన క్రికెట్ ఫ్యాన్స్, ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్‌ని టార్గెట్ చేస్తున్నారు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అసిఫ్ ఆలీ ఇచ్చిన క్యాచ్‌ని అందుకోవడంలో విఫలమయ్యాడు యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. అప్పటిదాకా చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్, ఒక్క క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిమానుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు...

దీనికి తోడు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సమయంలో పాక్ ఫ్యాన్స్, కొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించి మహ్మద్ షమీని దూషించినట్టుగా, ఇప్పుడు కూడా అర్ష్‌దీప్ సింగ్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ‘ఖలీస్తాన్’ ప్లేయర్‌ అంటూ వికీపీడియాలోనూ ఎడిట్ చేసి, ట్రోల్ చేయడంతో ఇది మనవాళ్ల పని కాదని స్పష్టంగా అర్థమవుతోంది.  

అర్ష్‌దీప్ సింగ్‌పై జరుగుతున్న ఈ సైబర్ దాడిని తీవ్రంగా ఖండించాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

‘దేశానికి ప్రాతినిథ్యం వహించే ప్రతీ అథ్లెట్ కూడా తన బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేశం తరుపున ఆడతాడు. వాళ్లకు మన సపోర్ట్ ఎప్పుడూ కావాలి. గుర్తుంచుకోండి... ఆటలో కొన్నిసార్లు గెలుపు వస్తే, మరికొన్ని మ్యాచుల్లో ఓటమి పలకరిస్తుంది. ఇలాంటి వాటికి ఏ ఒక్కరినో టార్గెట్ చేస్తూ దాడి చేయడం, దూషించడం కరెక్ట్ కాదు...

.. and give the best reply by performing on the field. I am keenly following you. My best wishes.

— Sachin Tendulkar (@sachin_rt)

ఆటకి ఇలాంటివి దూరంగా పెట్టాలి. అర్ష్‌దీప్ సింగ్, నిరంతరం శ్రమిస్తూ ఉండు. నిన్ను విమర్శిస్తున్న వాళ్లకు గ్రౌండ్‌లోనే నీ పర్ఫామెన్స్‌తో సమాధానం ఇవ్వు... నిన్ను గమనిస్తూ ఉంటాను.. నీకు నా బెస్ట్ విషెస్...’ అంటూ ట్వీట్లు చేశాడు సచిన్ టెండూల్కర్...

అర్ష్‌దీప్ సింగ్‌పై జరుగుతున్న సైబర్ దాడిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, హర్భజన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. భారత మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా అర్ష్‌దీప్‌కి అండగా నిలుస్తూ ‘We stand with Arshdeep’ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

పాకిస్తాన్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకతో తలబడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఆసియా కప్ 2022 ఫైనల్ చేరాలంటే ఈ రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది టీమిండియా...

పెద్దగా ఫామ్‌లో లేని శ్రీలంకను, పసికూన ఆఫ్ఘాన్‌ని ఓడించడం భారత జట్టుకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే సెప్టెంబర్ 11న మరోసారి పాకిస్తాన్‌, భారత్ తలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

click me!