టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగుతున్న సఫారీలు..

By Srinivas MFirst Published Sep 6, 2022, 4:53 PM IST
Highlights

T20I World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్  నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే  పొట్టి ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. తమ జట్టును ప్రకటించింది. 

మరో నెలన్నర రోజుల్లో  ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకావాల్సి ఉన్న  టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే పలు దేశాలు తమ జట్టును ప్రకటించగా తాజాగా ఆ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరింది.  మంగళవారం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఎ)..  ఈ మేరకు జట్టును ప్రకటించింది.  అక్టోబర్-నవంబర్ లలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్  లో దక్షిణాఫ్రికాను టెంబ బవుమా నడిపించనున్నాడు. జూన్ లో భారత్ తో ముగిసిన టీ20 సిరీస్ లో గాయపడ్డ బవుమా.. విరామం తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అయితే  సఫారీ జట్టులో కీలక ఆటగాడు రస్సీ వాన్ డర్ డసెన్ లేకుండానే ఈసారి దక్షిణాఫ్రికా పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. 

గాయం కారణంగా డసెన్  టీ20  ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు.  ఇంగ్లాండ్ తో ఇటీవల ముగిసిన  రెండో టెస్టు సందర్భంగా  డసెన్ చేతి వేలికి గాయమైంది. దీంతో  అతడి గాయానికి సర్జరీ అవసరమని  వైద్యులు సూచించారు.  డసెన్ కు కనీసం  ఆరు వారాల విశ్రాంతి అవసరమని  వైద్యులు చెప్పడంతో సీఎస్ఎ  ఈ నిర్ణయం తీసుకుంది. 

డసెన్ లేకున్నా సఫారీలకు నాణ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్ క్వింటన్ డికాక్, మార్క్రమ్,  హెండ్రిక్స్ వంటి టాపార్డర్ బ్యాటర్లతో పాటు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లు కూడా ఉన్నారు. వీరికి తోడు తాజాగా సఫారీ యువ కెరటం ట్రిస్టన్ స్టబ్స్ కూడా చేరాడు.

బౌలింగ్ విభాగానికొస్తే.. ప్రపంచ స్థాయి బౌలర్లు కగిసొ రబాడా,  అన్రిచ్ నోర్త్జ్, ఎంగిడ వంటి అందుబాటులో ఉన్నారు. స్పిన్నర్ల విషయానికొస్తే కేశవ్ మహారాజ్, తబ్రెయిజ్ షంషీ ఉండగా.. వీరితో పాటు డ్వేన్ ప్రిటోరియస్,. వేన్ పార్నెల్ వంటి ఆల్ రౌండర్లూ ఉన్నారు.  మొత్తం 15 మందితో కూడిన జట్టును, ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను కూడా సఫారీ బోర్డు ఎంపిక చేసింది.  

ఇదిలాఉండగా  అక్టోబర్ 16 నుంచి  నవంబర్ 13వరకు జరిగే ఈ మెగా టోర్నీకి ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ కూడా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.  తాజాగా ప్రకటించిన జట్టు.. త్వరలో భారత్ తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్ లలో కూడా ఆడనుంది. 

 

PROTEAS WORLD CUP SQUAD 🇿🇦

1⃣5⃣ players
🧢 World Cup debut for Tristan Stubbs
🤕 Rassie van der Dussen misses out due to injury pic.twitter.com/0Pzxm4uDQJ

— Cricket South Africa (@OfficialCSA)

టీ20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికా జట్టు : టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్త్జ్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసొ రబాడా, రిలీ రూసో, తబ్రెయిజ్ షంషీ, ట్రిస్టన్ స్టబ్స్ 

రిజర్వ్ ప్లేయర్స్ : బ్జోర్న్ పార్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే పెహ్లుక్వాయో 

* పైన పేర్కొన్న జట్టే భారత్  పర్యటనలో కూడా పాల్గొననుంది. 

click me!