Suresh Raina: రైనా రిటైర్మెంట్‌పై సీఎస్కే స్పందన.. ఐపీఎల్‌లో చిన్న తాల రికార్డులివే..

Published : Sep 06, 2022, 03:57 PM IST
Suresh Raina: రైనా రిటైర్మెంట్‌పై  సీఎస్కే స్పందన..  ఐపీఎల్‌లో చిన్న తాల రికార్డులివే..

సారాంశం

Suresh Raina Retirement: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా  అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో చెన్నై సీఈవో స్పందించాడు. 

టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సుదీర్ఘకాలం సేవలందించిన  సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల  క్రికెట్  కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు  సురేశ్ రైనా మంగళవారం తన ట్విటర్ ఖాతా వేదికగా ఈ ప్రకటన చేశాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి  తప్పుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు.  అయితే తాజాగా రైనా నిర్ణయంపై చెన్నై సూపర్ కింగ్స్  స్పందించింది. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్   రైనా రిటైర్మెంట్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఓ న్యూస్ ఏజెన్సీతో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘సురేశ్ రైనా  రిటైర్మెంట్ నిర్ణయం మాకు ముందే తెలుసు.  రెండ్రోజుల క్రితమే అతడు మాకు దీని గురించి సమాచారమందించాడు.  ఐపీఎల్ ను  వీడాలన్న  రైనా నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. రైనాకు శుభాకాంక్షలు’ అని తెలిపాడు. 

సీఎస్కేకు మహేంద్ర సింగ్ ధోని తర్వాత  సుదీర్ఘకాలం ఆడిన ఆటగాళ్లలో రైనా ఒకడు.  ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ‘చిన్న తాల’ అని పిలుచుకుంటారు. 2020 ఆగస్టులో ధోనితో పాటు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన రైనా.. తాజాగా దేశవాళీ, ఐపీఎల్ లకూ గుడ్ బై చెప్పాడు. 2021 సీజన్ వరకు  ఐపీఎల్ లో సీఎస్కే తరఫున ఆడిన రైనాను 2022 సీజన్ లో చెన్నై కొనుగోలు చేయలేదు. దీంతో అతడు  స్టార్ స్పోర్ట్స్  లో ఐపీఎల్ హిందీ కామెంట్రీ చెప్పాడు.  

 

ఐపీఎల్ లో తనకు స్థానం లేదని గ్రహించిన  రైనా.. ఫారెన్ లీగ్స్ లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. త్వరలోనే దక్షిణాఫ్రికా వేదికగా సౌతాఫ్రికా టీ20 వేలం జరగాల్సి ఉంది. ఈ లీగ్ లో ఆడాలని రైనా భావిస్తున్నాడు.  దీంతో పాటు  దుబాయ్ వేదికగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఆడాలని రైనా అనుకుంటున్నాడు. 

ఐపీఎల్ లో రైనాకు అదిరిపోయే రికార్డులున్నాయి.  వాటిని ఓసారి పరిశీలిస్తే.. 

- టీ20లలో 5 వేలు, 6 వేలు, 8 వేలు పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్. 
- మొత్తంగ ఐపీఎల్ లో 205 మ్యాచులాడిన రైనా.. 5,528 పరుగులు చేశాడు.  ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. 
- ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న రికార్డు (109) రైనా పేరు మీదే ఉంది. 
- ఐపీఎల్ లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్. ఈ జాబితాలో తొలి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. మొత్తంగా రైనా 203 సిక్సర్లు కొట్టాడు. 
- పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన  రికార్డు రైనా పేరిటే ఉంది. 
- విరామం లేకుండా రైనా ఏకంగా 132 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో ఇదో రికార్డు. 
- మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డు (ఐపీఎల్ లో)  కూడా రైనా పేరిటే ఉంది. 

 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా