
భారత్ లో క్రికెట్ ఓ మతం వంటిది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం క్రికెట్ ను ప్రజల రోజూవారీ జీవితాల నుంచి విడదీయలేం. క్రికెట్ పుట్టినిల్లు బ్రిటన్ లో కూడా లేని క్రేజ్.. మనకు ఉంది. ఆ క్రమంలో ఇండియాలో కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉద్భవించారు. తాజాగా టీమిండియా ప్రపంచ క్రికెట్ లో మరో అరుదైన ఘనతను సాధించబోతున్నది. యాధృశ్చికంగా ఈ ఘనత తోనే ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ పాలు పంచుకోనుండటం గమనార్హం. వెస్టిండీస్ తో ఫిబ్రవరి 6న మోతేరా స్టేడియం వేదికగా జరుగబోయే తొలి వన్డే భారత్ కు 1,000వ వన్డే. ఈ అరుదైన వన్డేకు హిట్ మ్యాన్ సారథిగా వ్యవహరించనున్నాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ తో పాటు ఏ జట్టు కూడా ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి వన్డేలు ఆడలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్న కాలమది. టెస్టు క్రికెట్ పట్ల జనాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1971 జనవరి 5 న తొలి వన్డే నిర్వహించింది. ప్రపంచ అగ్రశ్రేణి క్రికెట్ జట్లైన ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఇక భారత్ విషయానికొస్తే.. క్రికెట్ లో తొలి వన్డే జరిగిన నాలుగేళ్లకు మనం మొదటి వన్డే ఆడాం. 1974లో భారత జట్టు.. ఇంగ్లాండ్ తో హెడింగ్లీ వేదికగా తొలి వన్డే ఆడింది.
ఘనత వహించిన మన కెప్టెన్లు..
అజిత్ వాడేకర్ తో ప్రారంభమైన టీమిండియా వన్డే ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. తొలి వన్డే నుంచి వెయ్యో వన్డే దాకా కీలక వన్డేలలో మన సారథులెవరో ఇక్కడ చూద్దాం.
- తొలి వన్డే : అజిత్ వాడేకర్ .. ప్రత్యర్థి ఇంగ్లాండ్
- వందో వన్డే : కపిల్ దేవ్.. ప్రత్యర్థి ఆస్ట్రేలియా
- 300వ వన్డే : సచిన్ టెండూల్కర్..
- 500వ వన్డే : సౌరవ్ గంగూలీ.. ప్రత్యర్థి ఇంగ్లాండ్
- 700 నుంచి 900 వన్డే దాకా.. ఎంఎస్ ధోని
- 1000 వన్డే.. రోహిత్ శర్మ (?).. ప్రత్యర్థి వెస్టిండీస్
మన తర్వాతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేకు అజిత్ వాడేకర్ సారథిగా వ్యవహరించాడు. అప్పుడు మొదలైన భారత ప్రస్థానం.. 42 ఏండ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత జట్టు ఇప్పటివరకు 1974 నుంచి మొన్న దక్షిణాఫ్రికా తో ముగిసిన వన్డే సిరీస్ (1974-2022) వరకు 999 వన్డేలు ఆడింది. మన తర్వాత జాబితాలో ఆస్ట్రేలియా (958), పాకిస్థాన్ (936), శ్రీలంక (870), వెస్టిండీస్ (834), న్యూజిలాండ్ (775), ఇంగ్లాండ్ (761), సౌతాఫ్రికా (638), జింబాబ్వే (541), బంగ్లాదేశ్ (388) ఉన్నాయి.
విజయాలలోనూ..
999 వన్డే మ్యాచులాడిన భారత్.. 518 వన్డేలలో విజయం సాధించి 431 మ్యాచులలో ఓడింది. భారత విజయాల శాతం 54.54 శాతంగా ఉంది. ఈ జాబితాలో ఆసీస్ (63.36 శాతం), దక్షిణాఫ్రికా (63.75 శాతం), మాత్రమే మనకంటే ముందున్నాయి. దాయాది దేశం పాక్ (53.98 శాతం), ఇంగ్లాండ్ (53.07 శాతం) టీమిండియా వెనుకే ఉన్నాయి.