
‘అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. దీనినే కొంచెం ట్రెండ్ మార్చి వాడుతున్నారు క్రికెటర్లు.. బౌలర్లు, బ్యాటర్లు, ఫీల్డర్లు అనే తేడా లేకుండా తమ ఆనందాన్ని విభిన్న రూపాలలో పంచుకుంటున్నారు. అభిమానులకు దగ్గరవడానికి ఇదో కొత్త తరహా ట్రెండ్ అనుకున్నారో ఏమో గానీ.. దానిని ఫాలో అయిపోతున్నారు. వికెట్ తీస్తే బౌలర్.. క్యాచ్ పట్టినా, రనౌట్ చేసినా ఫీల్డర్.. విన్నింగ్ షాట్స్, సిక్సర్లు కొడితే బ్యాటర్లు.. మాటలకందని ఆ సంతోషాన్ని చేతల ద్వారా చూపిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో వైరల్ అవడానికి ఇదో కొత్త రకం ట్రెండ్ మరి...
ఇటీవలి కాలంలో వివిధ లీగ్స్ లో క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లలో.. ముఖ్యంగా బౌలర్లలో వికెట్ తీసినాక వాళ్లు జరుపుకునే వేడుకలు గతంతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటున్నాయి. గతంలో అయితే బౌలర్లు.. ఎవరైనా బ్యాటర్ ను ఔట్ చేస్తే గట్టిగా అరవడమో లేక అవుటైన బ్యాటర్ కు గుడ్ బై చెప్పడమో.. ఇంకా శృతి మించితే వారిని కవ్వించడమో చేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.
వికెట్ తీసినవెంటనే అప్పటికి దుమ్ము రేపుతున్న పాటలకు డాన్స్ లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న డాన్స్ స్టెప్పులను కాపీ కొట్టడం చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమా ప్రారంభమయ్యాక ఇది మరీ ఎక్కువైంది. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) నుంచి మొదలు.. తాజాగా జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) దాకా ఇప్పుడు ఇదే ట్రెండ్. బీపీఎల్ లో అయితే నజ్ముల్ ఇస్లాం, డ్వేన్ బ్రావ్, షకిబుల్ హసన్ మొదలు పలువురు వర్ధమాన క్రికెటర్లు.. పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’, ‘చూపే బంగారమాయేనే..’, ‘యే బిడ్దా’ లను స్టెప్స్ ను అనుసరిస్తుండటంతో అది కాస్తా బంగ్లాదేశ్ పుష్ప లీగ్ అయిపోయిందా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక బీపీఎల్ సంగతి అటుంచితే.. తాజాగా ఈనెల 27 నుంచి మొదలైన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఓ బౌలర్.. వికెట్ తీశాక అభిమానుల వైపునకు తిరిగి రెండు చేతులుపెట్టి దండం పెట్టాడు. లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్ మధ్య జరిగిన మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్ బౌలర్ షానవాజ్ దహానీ.. లాహోర్ బ్యాటర్ బెన్ డంక్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. యార్కర్ తో డంక్ ను బౌల్డ్ చేసిన దహానీ.. వికెట్ తీశాక స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకుల వైపు చూస్తూ దండం పెడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇవన్నీ చూస్తుంటే శ్రీశ్రీ చెప్పింది నిజమే కదా.. వేడకలకేదీ కాదు అనర్హం...