మోడీ పాకిస్తాన్ వెళ్లి బిర్యానీ తినొచ్చు, కానీ టీమిండియా వెళ్లకూడదా.. ఛాంపియన్స్ ట్రోఫీకి పొలిటికల్ హీట్

By tirumala AN  |  First Published Nov 29, 2024, 8:51 AM IST

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం కారణంగా క్రికెట్ కి రాజకీయ సెగ తగిలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ టీమిండియా పాకిస్తాన్ వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.


ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం కారణంగా క్రికెట్ కి రాజకీయ సెగ తగిలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ టీమిండియా పాకిస్తాన్ వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. 

2008 తర్వాత టీమిండియా పాకిస్తాన్ టూర్ కి వెళ్ళలేదు. పాకిస్తాన్ మాత్రం 2013లో ఇండియా వచ్చి ఒక సిరీస్ లో పాల్గొంది. టీమిండియా పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా తప్పు పట్టారు. తేజస్వి యాదవ్ కామెంట్స్ తో బీసీసీఐకి, టీమిండియాకి పోలిటికల్ సెగ మొదలైంది. 

Latest Videos

మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. 2015లో నరేంద్ర మోడీ పాకిస్తాన్ లో పర్యటించారు. పాకిస్తాన్ ప్రధానితో కలసి బిర్యానీ తిన్నారు. మోడీ పర్యటనకి లేని అభ్యంతరం.. టీమిండియా పాకిస్తాన్ వెళ్ళడానికి ఎందుకు వచ్చింది ? క్రీడల్లో రాజకీయాల జోక్యం మంచిది కాదు. అంటే ఒలంపిక్స్ లో కూడా ఒక దేశానికీ ఇతర దేశాలు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తారా ? పాకిస్తాన్ కి మోడీ వెళ్లడం మంచి విషయం అయినప్పుడు.. టీమిండియా వెళ్లడం కూడా మంచి విషయమే కదా అని తేజస్వి యాదవ్ అన్నారు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడం పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల ఆల్రెడీ స్పందించారు. బీసీసీఐ తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాలకు లోబడి పనిచేస్తుంది అని రాజీవ్ శుక్ల అన్నారు. మరో రెండు నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. కానీ ఇంతవరకు ఐసీసీ షెడ్యూల్ పూర్తి చేయలేదు. దానికి కారణం టీమిండియా, బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడమే అని అంటున్నారు. 

ఒక వేళ పాకిస్తాన్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి మరో దేశం ఆతిథ్యం పంచుకుంటే అప్పుడు టీమిండియాకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా తేజస్వి యాదవ్ లేటెస్ట్ కామెంట్స్ క్రీడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

టీమిండియా, పాకిస్తాన్ ఎప్పుడు క్రికెట్ ఆడినా ఫ్యాన్స్ కి వచ్చే మజా వేరు. పాకిస్తాన్, ఇండియా కలసి ఐసీసీ టోర్నీలలో తప్ప ఇతర సిరీస్ లలో పాల్గొనడం లేదు. దీనితో ఇండియా, పాక్ మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది. 

click me!