India vs England: రాంచీ వేదికగా భారత్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఇంగ్లాండ్ స్పిన్ మాయాజాలంతో టీమిండియాను దెబ్బకొట్టింది. అయితే, వరుసగా ఇతర ప్లేయర్ల పెవిలియన్ బాటపట్టిన క్రమంలో యశస్వి జైస్వాల్ మరోసారి రాణించి 73 పరుగులు సాధించాడు.
India vs England - Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ ప్లేయర్ మరోసారి మెరిశాడు. రాంచీ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ 4వ మ్యాచ్ లో మరిన్ని రికార్డులు సృష్టించాడు. ఇంగ్లాండ్ స్పిన్ మాయాజాలంతో వరుసగా భారత బ్యాటర్లు పెవిలియాన్ కు క్యూకట్టగా, మరో ఎండ్ లో యశస్వి జైస్వాల్ తనదైన ఆటతో రాణించాడు. భారత తొలి ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో కెప్టెన్ రోహిత్ శర్మను జేమ్స్ అండర్సన్ వెనక్కి పంపి ఇంగ్లాండ్ కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ లు టచ్ ఉన్నట్టు కనిపించినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.
ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ దెబ్బకు భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (17* పరుగులు), ధృవ్ జురెల్ (30* పరుగులు) ఉన్నారు. భారత ఇన్నింగ్స్ రెండో యశస్వి జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కొట్టాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే దిగ్గజ ప్లేయర్ల రికార్డులు బద్దలు కొట్టాడు. 64 ఎళ్ల నాటి నారీ కాంట్రాక్టర్ (1960-61) రికార్డును బద్దలు కొడుతూ.. సునీల్ గవాస్కర్ సరసన చేరాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 353 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (2) మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. అయితే, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ లు 131 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని ఛేదించిన షోయబ్ బషీర్ గిల్ (38)ను ఔట్ చేశాడు. రజత్ పాటిదార్ ఆచితూచి ఆడుతుండగా, బషీర్ అతడిని (17) ఔట్ చేసి వెనక్కి పంపాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా (12)ను కూడా బషీర్ వెనక్కి పంపాడు. యశస్వి జైస్వాల్ ను కూడా 73 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు.
ఈ సిరీస్ లో యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 618 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్ లలో 80, 15, 209, 13, 10, 214*, 73 పరుగులు కొట్టాడు. ఈ టెస్టు సిరీస్ లో నాలుగుసార్లు 50+ పరుగులు చేసి ఒకే సిరీస్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఎడమచేతి వాటం ఓపెనర్ గా నిలిచాడు. గతంలో నారీ కాంట్రాక్టర్ 1960-61లో పాకిస్థాన్ పై, సద్గోపన్ రమేశ్ 1999లో న్యూజిలాండ్ పై మూడుసార్లు ఈ ఘనత సాధించారు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ గా నాలుగుసార్లు 50+ పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ 5 సార్లు (1979) ఈ ఘనత సాధించాడు. 1961-62లో ఎంఎల్ జయసింహ నాలుగు సార్లు, గవాస్కర్ 1981-82లో నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.