ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ జట్టు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరికి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది.
దాదాపు 10 ఏళ్ల తర్వాత వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెండా పాతింది. ముంబై ఇండియన్స్‌పై అపూర్వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో బెంగళూరు టీమ్ ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఏగ బాకింది. దూకుడుగా ఆడిన ముంబై బ్యాటర్లను సమర్థవంతంగా కంట్రోల్ చేయడంతో బెంగళూరు జట్టు 12 పరుగల తేడాతో విజయం సాధించింది.
ఇక అంతకు ముందు టాస్ ఓడి తొలుగు బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ 67 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 64 పరుగులతో జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టించడంతో కీలక పాత్ర పోషించారు. జితేష్ శర్మ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తూరు ఒక వికెట్ పడగొట్టాడు.
ఆర్‌సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా(4/45) అద్భుత బౌలింగ్‌తో రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయగా హార్థిక్ పాండ్యా కేవలం 15 బంతుల్లో 42 పరుగులు చేసి చెలరేగాడు. అయితే పాండ్యా పెవిలియన్ బాట పట్టడంతో ముంబై ఓటమికి బాటలు పడ్డాయి. తర్వాత ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం వరించింది.
ఇరు జట్ల ప్లేయింగ్ XI:
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా మరియు విఘ్నేష్ పుత్తూర్. ఇంపాక్ట్ ప్లేయర్: రోహిత్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ.