
Bangalore stampede: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా గెలుచుకున్న ఆనందోత్సవం చిన్నస్వామి స్టేడియంలో విషాదంగా మారింది. స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బుధవారం జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో ఆర్సీబీ స్పందించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, తొక్కిసలాటలో గాయపడినవారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకంగా ఆర్సీబీ కేర్స్ (RCB Cares) అనే సహాయ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
“బెంగళూరులో జరిగిన ఘటన ఆర్సీబీ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాము. వారికి అండగా ఉంటాము. ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నాం. అలాగే గాయపడిన వారికి సాయం చేసేందుకు ‘RCB Cares’ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా అభిమానులు ఎల్లప్పుడూ మా హృదయంలో ఉంటారు. ఈ కష్ట సమయంలో వారికి మేము తోడుగా ఉన్నాము” అని ఆర్సీబీ పేర్కొంది.
ఈ ఘటన జరిగిన సమయంలో స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. టికెట్ ఉన్నవారికే ప్రవేశం ఉన్నా, వెలుపల పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో తొక్కిసలాట జరిగింది. అధికారిక సమాచారం ప్రకారం 11 మంది మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు.
ఈ ఘటనపై ప్రముఖ ఆటగాళ్లు స్పందించారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ విషాద ఘటనపై స్పందిస్తూ తన సంతాపాన్ని తెలియజేశారు.
ఈ ప్రమాదంపై క్రికెట్ అభిమానులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నారు. కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆర్సీబీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంపై కేసు నమోదైంది. సీఐడీకి కేసును అప్పగించారు.