బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్... ఐదో టెస్టుకి ముందు...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2021, 3:50 PM IST
Highlights

సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో కూడా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్... 

ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. నిన్న హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ రాగా, తాజాగా సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో కూడా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ ముగ్గురూ 10 రోజుల పాటు తప్పనిసరి ఐసోలేషన్‌లో గడపబోతున్నారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్టు తేలిన విషయం తెలిసిందే. రవిశాస్త్రితో పాటు భారత కోచింగ్ సిబ్బంది మరో ముగ్గురు కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కి వెళ్లారు... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో కాంటాక్ట్ ఉన్న కారణంగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పాటు భారత ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటల్ కూడా ఐసోలేషన్‌కి వెళ్లారు...

తాజాగా సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో రవిశాస్త్రితొ పాటు భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ ముగ్గురూ 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ సూచించారు వైద్యులు...

ఈ కారణంగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత జట్టు కోచింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండానే బరిలో దిగనుంది. రవిశాస్త్రి మంగళవారం రాత్రి ఇంగ్లాండ్‌లోని విక్టోరియా ఏరియాలో ఉన్న సెయింట్ జెమ్స్ కోర్ట్ హోటల్‌లో తన పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యాడు. ఈ సభకు రవిశాస్త్రితో పాటు భారత సారథి విరాట్ కోహ్లీ మరికొందరు జట్టు సభ్యులు హాజరయ్యారు....

వీరెవ్వరూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఈ విషయం గురించి సమాచారం కూడా ఇవ్వలేదట. ఈ వేడుకకి చాలా మంది అతిథులు రావడంతో వారిలో ఎవరి ద్వారానైనా రవిశాస్త్రికి వైరస్ సోకి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు అధికారులు....

విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ప్లేయర్లు అందరికీ నాలుగుసార్లు కరోనా పరీక్షలు చేసిన తర్వాత నాలుగో రోజు ఆటలో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది ఈసీబీ. లండన్‌లో గత వారం రోజుల్లో 21 వేల కొత్త కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి పరిస్థితులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇలా చెప్పాపెట్టుకుండా పార్టీలు, సమావేశలకు హాజరుకావడంపై విమర్శలు వస్తున్నాయి.  

click me!