INDvsENG 4th Test: నిలబడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు... ఇటు 10 వికెట్లు, అటు 291 పరుగులు...

By Chinthakindhi RamuFirst Published Sep 5, 2021, 11:33 PM IST
Highlights

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఇంగ్లాండ్... ఆఖరి రోజు ఆతిథ్య జట్టుకి కూడా విజయావకాశాలు...

ఇంగ్లాండ్‌కి నాలుగో ఇన్నింగ్స్‌లో 368 పరుగుల టార్గెట్ ఇచ్చిన తర్వాత వెంటవెంటనే వికెట్లు తీసి, ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించాలని చూసినా, టీమిండియాకి ఆతిథ్య జట్టు ఓపెనర్లు షాక్ ఇచ్చారు. రోరీ బర్న్స్ 109 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేయగా, హసీబ్ హమీద్ 85 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. 

పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడం, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగడంతో నాలుగో రోజు మూడో సెషనల్‌లో 32 ఓవర్లు వేసిన టీమిండియా వికెట్ సాధించలేకపోయింది...
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఓపెనర్లు, తొలి వికెట్‌కి అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పిచ్ స్పిన్‌కి చక్కగా సహకరిస్తుండడంతో ఏడో ఓవర్‌లో రవీంద్ర జడేజాని బౌలింగ్‌కి తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 13 ఓవర్లు వేసినా వికెట్ దక్కలేదు.

గత ఐదు టెస్టుల్లో బౌలింగ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న జడ్డూని ఆడించి, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టిన టీమిండియా, భారీ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది.నాలుగో టెస్టులో విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ ఆఖరి రోజు 291 పరుగులు సాధించాల్సి ఉంటుంది. అంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ చేసిన స్కోరు చేస్తే చాలు.

అదే టీమిండియా విజయం సాధించాలంటే 90 ఓవర్లలో 10 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. జడేజా తప్ప, భారత జట్టులో మరో స్పిన్నర్ అందుబాటులో లేడు. రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ వేయగలిగినా, ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా అతనితో బౌలింగ్ వేయించింది లేదు. దీంతో బ్యాటింగ్‌లో అదరగొట్టి, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా... రావాల్సిన ఫలితం వస్తుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...

click me!