ఆసియా కప్‌కి ముందు టీమిండియాకి మరో షాక్... రాహుల్ ద్రావిడ్‌కి కరోనా పాజిటివ్...

By Chinthakindhi RamuFirst Published Aug 23, 2022, 10:41 AM IST
Highlights

కరోనా పాజిటివ్‌గా తేలిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... ద్రావిడ్ లేకుండా యూఏఈకి భారత జట్టు... 

ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. ఈ సమయంలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డాడు...

రాహుల్ ద్రావిడ్‌కి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆసియా కప్‌ 2022 టోర్నీ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుంది. ఆగస్టు 28న దాయాది పాకిస్తాన్‌‌తో తొలి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్ సమయానికి రాహుల్ ద్రావిడ్ కరోనా నుంచి బయటపడడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే ఆసియా కప్ 2022 టోర్నీకి బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు...

జింబాబ్వే టూర్‌లో టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఆసియా కప్ 2022 టోర్నీకి కూడా హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది... ఇప్పటికే ఆసియా కప్ 2022 టోర్నీ కోసం ముంబైలో బీసీసీఐ నిర్వహిస్తున్న క్యాంపులోకి చేరుకున్నారు భారత క్రికెటర్లు. రేపు (ఆగస్టు 24) యూఏఈ బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు...

జింబాబ్వే టూర్‌ ముగించుకున్న కెఎల్ రాహుల్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, దీపక్ చాహార్, అక్షర్ పటేల్ వంటి ఆసియా కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లు నేరుగా అక్కడి నుంచి యూఏఈ చేరుకుంటారు...

విరాట్ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీ ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అలాగే జింబాబ్వే టూర్‌కి దూరంగా ఉన్న రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్లు... ఒక్కసారిగా కాకుండా విడతలుగా యూఏఈ చేరుకోబోతున్నారని సమాచారం...

ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగో టెస్టుకి ముందు తన పుస్తకావిష్కరణ సభకు వెళ్లి అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఇదే టెస్టు నడుస్తున్న సమయంలోనే బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్... ఇలా భారత బృందంలో ఒక్క బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మినహా అందరూ కోవిద్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మాంచెస్టర్ టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత జట్టు మ్యాచ్‌ని రద్దు చేసుకుని..  ఐపీఎల్ 2022 సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ వెళ్లిపోయింది...

ఇది జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు భారత హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డాడు. ఈసారి ద్రావిడ్‌ని ఇక్కడే వదిలేసి, ఆసియా కప్ 2022 టోర్నీ కోసం యూఏఈ వెళ్లనుంది భారత జట్టు... డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ 2022 బరిలో దిగుతున్న రోహిత్ సేనపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌పై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు... 

click me!