PM Narendra Modi : వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించనున్న మోడీ .. ప్రధాని సమక్షంలో టీమిండియాను ఆపేదెవరు..!!

By Siva Kodati  |  First Published Nov 16, 2023, 7:29 PM IST

అహ్మదాబాద్‌లో నవంబర్ 19న జరిగే ఫైనల్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో ఒక జట్టు ఢీకొట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరవుతారని జాతీయ వార్తా సంస్థ దైనిక్ జాగరణ్ నివేదించింది.


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు భారత్ ఒక అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లు , సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలుపుతో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచిన టీమిండియా ఫైనల్‌లో గెలిచి మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది. కోట్లాది మంది భారతీయులు కూడా ఇండియా గెలవాలని పూజలు, హోమాలు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో నవంబర్ 19న జరిగే ఫైనల్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో ఒక జట్టు ఢీకొట్టనుంది. 

ఫైనల్ మ్యాచ్‌కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండగా.. ఈ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరవుతారని జాతీయ వార్తా సంస్థ దైనిక్ జాగరణ్ నివేదించింది. స్వతహాగా క్రికెట్‌కు వీరాభిమాని అయిన మోడీ.. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించిన వెంటనే టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలను అభినందిస్తూ మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Latest Videos

undefined

ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అదే ఆయన వీక్షించిన చివరి క్రికెట్ మ్యాచ్. మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇద్దరూ ఆ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు నరేంద్ర మోడీ స్టేడియానికి చేరుకుని ఇరు జట్ల ఆటగాళ్లతో సమావేశమయ్యారు. అలాగే ప్రధానులిద్దరూ ల్యాప్ ఆఫ్ హానర్ అందుకుని భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ తొలి రోజు ఆటను వీక్షించారు. 

ఇకపోతే.. ఆదివారం జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే చిరకాల ప్రత్యర్ధులు మరోసారి ఢీకొట్టుకునే అవకాశం వుంది. ఇప్పటికే టీమిండియా లీగ్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించిన సంగతి తెలిసిందే.  1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో, 2011లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ రెండు సార్లు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే సొంత దేశంలో ఆడుతుండటం, వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలవడం, ఆటగాళ్లంతా భీకర ఫాంలో వుండటంతో భారత్‌ విజయంపై అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!