
త్వరలో బెంగళూరు వేదికగా జరుగబోయే ఐపీఎల్ మెగా వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో పాల్గొనేందుకు ఇప్పటికే పలు దేశాలకు చెందిన క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి వచ్చిన 1,214 ప్లేయర్ల జాబితాను కాచి వడబోచింది బీసీసీఐ. ఈ జాబితా నుంచి 590 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ 590 మందిలో 228 మంది క్రికెటర్లు క్యాప్డ్ (ఏదైనా దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నవారు) ప్లేయర్లు కాగా 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు(ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడనివాళ్లు). ఏడుగురిని అసోసియేట్ నేషన్స్ నుంచి తీసుకున్నారు.
ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసి ఐపీఎల్ పాలక మండలికి పంపింది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్లతో పాటు పలు ఫ్రాంచైజీలు కూడా మరో 44 మంది ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించాయి. అయితే వేలం సమయానికి ఇందులో (590 మందిలో) కూడా కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
మొత్తం 590 మంది ఆటగాళ్లలో భారత క్రికెటర్లే 370 (క్యాప్డ్, అన్ క్యాప్డ్) ఉన్నారు. 220 మంది విదేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. యువ భారత (అండర్-19) జట్టుకు సారథ్య వహిస్తున్న యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజవర్దన్ హంగర్గేకర్, ఓపెనర్ రఘువంశీ, హర్నూర్ సింగ్ లతో పాటు జూనియర్ ఏబీ డివిలియర్స్ గా పేరున్న దక్షిణాఫ్రికా యువ సంచలనం బ్రేవిస్ కూడా జాబితాలో ఉన్నాడు. ఈ యువ సంచనాలను ఏ జట్టు దక్కించుకుంటుందో మరి..
యువ ఆటగాళ్లే గాక.. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఆర్.అశ్విన్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, అజింక్యా రహానే, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి టీమిండియా స్టార్లు ఈ వేలంలో ఏ ఫ్రాంచైజీకి ఆడనున్నారనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.
భారత్ ఆటగాళ్లతో పాటు డుప్లెసిస్, కగిసొ రబాడా, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిర్ స్టో, జేసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షకిబ్ అల్ హసన్, వనిందు హసరంగ వంటి విదేశీ ఆటగాళ్లను దక్కించుకోవడానికి పది ఫ్రాంచైజీలు ఆసక్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కేటగిరీలో 48 మంది..
వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో 48 మంది ఆటగాళ్లకు అత్యధిక రిజర్వ్ ప్రైస్ ను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. ఇక రూ. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైస్ జాబితాలో 20 మంది క్రికెటర్లు ఉన్నారు. కోటి రూపాయల రిజర్వ్ ధరలో 34 మంది ఉన్నారు.
ఏ ఏ దేశం నుంచి ఎంతమంది..?
590 మంది ఆటగాళ్లలో భారత క్రికెటర్లే 370 మంది ఉండగా.. మిగిలిన 220 మందిలో ఈ దేశాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లున్నారు. వారిలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది ఉన్నారు. ఇక ఆ తర్వాత జాజితాలో వెస్టిండీస్ (34), సౌతాఫ్రికా (33), ఇంగ్లాండ్ (24), న్యూజిలాండ్ (24), ఆఫ్గానిస్థాన్ (17), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (5), శ్రీలంక (23), జింబాబ్వే (1), నమీబియా (3), నేపాల్ (1), స్కాట్లాండ్ (2), యూఎస్ఎ (1) ల నుంచి ఉన్నారు.