
ఈ ఏడాది ఐపీఎల్ లో పాత 8 ఫ్రాంచైజీలతో పాటు రెండు కొత్త జట్లు కూడా రాబోతున్నాయి. లక్నో, అహ్మదాబాద్ లు ఈ ఐపీఎల్ లో భాగం కానున్నాయి. ఐపీఎల్ వేలం దగ్గరపడుతున్నా ఇప్పటికీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. జట్టు పేరు కూడా ప్రకటించకుంటే మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో మాత్రం జట్టు పేరుతో పాటు తాజాగా లోగోను కూడా విడుదల చేసింది. మెగా వేలానికి ముందు లక్నో అభిమానుల నిరీక్షణను ముగిస్తూ.. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తన సోషల్ మీడియా ఖాతాలలో లక్నో సూపర్ జెయింట్స్ కు చెందిన అధికారిక లోగోను పంచుకుంది.
లోగో డిజైన్ లో పూర్తి భారతీయతను కలబోసింది లక్నో ఫ్రాంచైజీ. మధ్యలో బ్యాటు, బంతి.. అటూ ఇటూ దేశ జాతీయ జెండాలోని రంగులతో కూడిన రెక్కలు ఉన్నాయి. ఈ లోగోను చూస్తుంటే తాము లక్నోకే పరిమితం కాదని, పాన్ ఇండియా కు దగ్గరవడానికి ఫ్రాంచైజీ తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించక మానదు.
లోగో డిజైన్ గురించి చెప్పాలంటే.. మధ్యలో ఉన్న బ్యాట్ కు రెండు పక్కలా త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ)ను పోలిన రెక్కలు ఉన్నాయి. భారతీయ పురాణాల్లోని గరుడ పక్షి నుంచి ప్రేరణ పొంది దీనిని తీసుకున్నారు. రక్షకుడిగా గుర్తింపు పొందిన గరుడ పక్షి.. వేగంగా దూసుకెళ్లడంలో దిట్ట. బ్యాట్ కు రెక్కలు దీని నుంచి స్ఫూర్తి పొందిందే.
ఇక త్రివర్ణ పతాకంలోని రంగులను వాడటం ద్వారా తమ జట్టుకు పాన్ ఇండియా టచ్ ఇచ్చింది లక్నో ఫ్రాంచైజీ. బ్యాట్ కు నీలం రంగును ఇచ్చారు. అది క్రికెట్ ఆటను సూచిస్తున్నది. నారింజ రంగు సీమ్ తో కూడిన ఎరుపు బంతి కూడా ఉంది. ఇది నుసుట తిలకంలా కనిపిస్తున్నది.
మొత్తానికి గతేడాది ఐపీఎల్ లో రూ. 7,090 కోట్లతో బిడ్ వేసి లక్నో ఫ్రాంచైజీని గెలుచుకున్న సంజీవ్ గొయెంకా.. దానిని కేవలం ఉత్తరప్రదేశ్ వరకే పరిమితం చేయలేదని లోగో ద్వారా స్పష్టమవుతున్నది. పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నదంటే ఆటను మరోస్థాయిని తీసుకెళ్లడానికి భారీ మాస్టర్ ప్లాన్ వేసింది. మరి లక్నో జట్టు కోసం ఇంత భారీగా ఖర్చు పెడుతున్న గొయెంకా కలలను.. కెఎల్ రాహుల్ సేన (ఇంకా ఖరారు కాలేదు) తీరుస్తుందా..? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
లక్నో జట్టుకు కెఎల్ రాహుల్ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే. రూ. 17 కోట్లతో అతడిని దక్కించుకున్న ఆ ఫ్రాంచైజీ.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్క్ స్టాయినిస్, రవి బిష్ణోయ్ లను దక్కించుకుంది. ఈ ముగ్గురూ పోను ఇంకా ఆ ఫ్రాంచైజీ ఖాతాలో మరో రూ. 58 కోట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 12,13 న జరుగబోయే వేలంలో ఈ రూ. 58 కోట్లతోనే మిగతా జట్టును నిర్మించుకోవాల్సి ఉంది. కాగా, లక్నో జట్టుకు కోచ్ గా ఆండీ ఫ్లవర్ వ్యవహరిస్తుండగా.. మెంటార్ గా గౌతం గంభీర్ నియమితుడైన విషయం తెలిసిందే.