బాబర్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహం..! కోచింగ్ సిబ్బంది మార్పు.. ఇది దేనికి సంకేతం..?

Published : Mar 15, 2023, 03:44 PM IST
బాబర్‌కు  చెక్ పెట్టేందుకు వ్యూహం..! కోచింగ్ సిబ్బంది మార్పు..  ఇది దేనికి సంకేతం..?

సారాంశం

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ లో సమూల మార్పులకు పీసీబీ శ్రీకారం చుట్టిందా..? బాబర్ కు బోర్డుతో పాటు జట్టులో ఉన్న బలమైన కోటరీని తెంచేందుకు పీసీబీ వ్యూహం పన్నిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమూల మార్పులకు తెర లేచిందా..? జట్టు  సారథిని ఇదివరకే  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరు చెప్పి పక్కకు పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు  కోచింగ్ సిబ్బందిని కూడా మార్చింది.  ఈ నెలలో   జరుగబోయే  అఫ్గానిస్తాన్ తో సిరీస్ కు  బాబర్ కు రెస్ట్ ఇచ్చిన  పీసీబీ తాజాగా  హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ లను కూడా మార్చింది.  అఫ్గాన్ తో టీ20 సిరీస్ కు  షాదాబ్ ఖాన్  ను కెప్టెన్ గా  హెడ్ కోచ్ (తాత్కాలిక) గా అబ్దుల్ రెహ్మాన్ ను, బౌలింగ్ కోచ్ గా ఉమర్ గుల్ ను నియమించింది. 

వాస్తవానికి బాబర్ ను పాక్ సారథిగా  తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు పలువురు చాలాకాలంగా  డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.  బాబర్ తన వ్యక్తిగత రికార్డుల కోసమే తప్ప టీమ్ కోసం ఆడటం లేదని కూడా అక్తర్, కనేరియా వంటి  ఆటగాళ్లు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. 

వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ లలో  జట్టును  నడిపించిన  బాబర్.. స్వదేశంలో  మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,  న్యూజిలాండ్ చేతిలో పరాజయాలు  అతడి కీర్తిని మసకబార్చాయి.  బ్యాటింగ్ లో రికార్డులు సాధిస్తున్నాడన్నమాటే గానీ ఆ రికార్డులు జట్టు విజయాలకు ఉపయోగపడటం లేదు.  దీంతో బాబర్ ను టీ20లతో  పాటు  అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా తొలగించాలని డిమాండ్లు వినిపించాయి.   

అయితే మాజీ పీసీబీ చీఫ్  రమీజ్ రాజా హయాంలో బాబర్ చెప్పిందే వేదం. బోర్డులో తనకున్న  పరిచయాలతో పాకిస్తాన్ క్రికెట్ లో తననెవరూ టచ్ చేయని స్థితిలో ఉన్న బాబర్ ను  ఇప్పటికిప్పుడు సారథ్య పగ్గాలనుంచి తప్పించడం అంత ఈజీ కాదన్న సంగతి కొత్త అధ్యక్షుడు నజమ్ సేథీకి తెలుసు. అందుకే  తన చుట్టూ ఉన్న  మనుషులను దూరం చేస్తూ బాబర్ ను ఒంటరి చేసేందుకు  వ్యూహం పన్నినట్టేనని  పీసీబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.  

 

ఇందులో భాగంగానే కొత్త సెలక్షన్ చీఫ్ తీసుకొచ్చిన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పాలసీని బూచీగా చూపి బాబర్  తో పాటు ఐదుగురు సీనియర్ ప్లేయర్లకు అఫ్గాన్  తో సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. కొత్త కెప్టెన్ గా షాదాబ్ ఖాన్ ను నియమించారు.  ఇక ఇప్పుడు  హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ (షాదాబ్ ఖాన్ కు పిల్లనిచ్చిన మామ) తో పాటు బౌలింగ్ కోచ్ ను మార్చారు.  ఆ స్థానంలో ఉమర్ గుల్ ను నియమించారు. ఈ మార్పులు  తాత్కాలికమే అని చెబుతున్నా భవిష్యత్ లో ఇవే కొనసాగుతాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. 

ఇక పాకిస్తాన్  కొత్త హెడ్ కోచ్ అబ్దుల్ రెహ్మన్  ఆ దేశంలోని నార్త్ రీజియన్ లో   వివిధ జట్లకు  పనిచేసిన అనుభవం  ఉన్నవాడు.  దేశవాళీ క్రికెట్ తో పాటు పీఎస్ఎల్ లో ముల్తాన్ సుల్తాన్స్  లో అసిస్టెంట్ కోచ్ గా చేశాడు.  పాకిస్తాన్ అండర్-19 టీమ్ కు కూడా హెడ్ కోచ్ గా పనిచేశాడు. ఉమర్ గుల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక  పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున  బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.   అఫ్గానిస్తాన్ జట్టుకు కూడా  కొంతకాలం పాటు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ స్వంత దేశానికే తిరిగివచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?