
క్రికెట్‌లో సక్సెస్ కాలేకపోయిన ఓ క్రికెటర్, డబ్బు సంపాదించడానికి దొంగ మార్గాలను ఎంచుకుని, కటకటాల పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్‌ని అని చెప్పుకుంటూ, 60 కంపెనీలను మోసం చేసిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు బుదుమురు, దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సిటీ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగం చేసి మానేసిన నాగరాజు, జగన్ మోహన్ రెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌నని చెప్పుకుంటూ ఆంధ్ర టీమ్ తరుపున అదరగొడుతున్న రికీ బుయ్ కోసం స్పాన్సర్ చేయాల్సిందిగా పలు కంపెనీలను సంప్రదించాడు. వారి వద్ద నుంచి వేల నుంచి లక్షల రూపాయల దాకా వసూలు చేశాడు. ఇలా దాదాపు 60 కంపెనీల నుంచి రూ.3 కోట్లు, నాగరాజు వసూలు చేసినట్టు సమాచారం..
నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్‌సీఏ) శిక్షణ తీసుకున్నానని ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఈమెయిల్స్ చూపించి, సిటీ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగం సంపాదించాడు నాగరాజు బుదుమురు. విషయం తేలియడంతో అతనికి రూ.12 లక్షలు చెల్లించి, ఉద్యోగం నుంచి తొలగించింది సదరు కంపెనీ... తాజాగా నాగరాజుపై ఫిర్యాదు స్వీకరించిన ఏపీ పోలీసులు దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి...
‘బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత దర్యాప్తు చేయగా.. కంపెనీలు, క్రికెటర్ స్పాన్సర్‌షిప్ కోసం ఇచ్చిన మనీ మొత్తం నాగరాజు తన సొంత అవసరాల కోసం వాడుకున్నట్టు తేలింది. అతని కోసం గాలించగా తన స్వగ్రామంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ఎవ్వరిపెట్టలో ఉన్నట్టు తెలిసి, అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నాం... ’ అంటూ సైబర్ క్రైమ్ డీసీపీ డీఆర్ బాల్‌సింగ్ రాజ్‌పుత్ మీడియాకి తెలియ చేశారు..
నిందితుడి నుంచి దాదాపు రూ.7 లక్షల 60 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగిలిన డబ్బులను ఎలా ఖర్చు చేసింది? ఎవరెవరికి ఇచ్చింది? అనే విషయాలను త్వరలోనే తెలుసుకుంటామని మీడియాకి తెలిపారు పోలీసులు....
నాగరాజు బుదుమురు కెరీర్ ఆరంభంలో బాగా ఆడేవాడు. క్రికెట్‌లో వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. అయితే 2018 తర్వాత అతని పర్ఫామెన్స్ దారుణంగా పడిపోయింది. అతనికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. సంపాదన కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో జనాలను మోసం చేసి, డబ్బులు సంపాదించే పనిని ఎంచుకున్నాడు..
క్రికెటర్లకు స్పాన్సర్లుగా చెప్పుకుంటూ కంపెనీలకు ఫేస్ ఈమెయిల్స్ చేసేవాడు. అలా కూడా వర్కవుట్ కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్‌ని అని చెప్పి, కంపెనీల నుంచి క్రికెటర్‌కి స్పాన్సర్ చేయాల్సిందిగా డిమాండ్ చేసేవాడు. అలా ఒకటి రెండూ కాదు, 60 కంపెనీల నుంచి రూ.3 కోట్లను వసూలు చేశాడు నాగరాజు...
2014లో ఆంధ్ర ప్రదేశ్ టీమ్‌కి రంజీ ట్రోఫీ ఆడిన నాగరాజు బుదుమురు, ఆ తర్వాతి సీజన్లలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో అతన్ని టీమ్ నుంచి తప్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్, నాగరాజును బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతనికి ఎప్పుడూ తుది జట్టులో అవకాశం రాలేదు..