నయా పాకిస్థాన్ టీం...ఐదుగురు కొత్తవారికి చోటు: మిస్బా సంచలన నిర్ణయం

By Arun Kumar PFirst Published Sep 22, 2019, 4:03 PM IST
Highlights

చాలాకాలం తర్వాత స్వదేశంలో జరగనున్న వన్డే సీరిస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ టీం సిద్దమయ్యింది. శ్రీలంకతో జరగనున్న ఈ సీరిస్ కోసం పాకిస్థాన్ జట్టును మిస్బా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసి ప్రకటించింది. 

చాలాకాలం తర్వాత పాకిస్థాన్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ సీరిస్ జరగబోతోంది. ఏ జట్టుపై ఉగ్రదాడి జరగడం వల్ల ఇన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచుల ఆతిథ్యానికి  దూరమయ్యిందో అదే శ్రీలంక టీంతో పాక్ తలపడనుంది. మరికొద్దిరోజుల్లో ఆరంభం కానున్న వన్డే సీరిస్ కోసం పాక్ సెలెక్షన్ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్లో ఈ ఆటగాళ్ల వివరాలను పొందుపర్చారు.

ప్రపంచ కప్ టోర్నీలో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్థాన్ క్రికెట్లో పెను మార్పులు  చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా చీఫ్ కోచ్,సెలెక్టర్ రెండు బాధ్యతలను మాజీ కెప్టెన్   మిస్బావుల్ హక్ అందుకున్నాడు. దీంతో అతడి ఆలోచనలు, వ్యూహాలకు తగ్గట్లుగా ఈ జట్టు ఎంపిక జరిగింది. మిస్బా సీనియర్ల కంటే యువకులపైనే ఎక్కువ నమ్మకంతో వున్నట్లు ఆటగాళ్ల లిస్ట్ ను బట్టిచూస్తే తెలుస్తోంది. 

16మందితో కూడిన పాక్ జట్టులో ఐదుగురు కొత్తవారికి  చోటుదక్కింది. వీరికి గతంలోనే అవకాశం దక్కాల్సి వుందని...కానీ కాస్త  ఆలస్యంగా అయినా అవకాశం దక్కిందని మిస్బా పేర్కొన్నాడు. ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు పాక్ జట్టుకు సేవలందించేందుకు సిద్దంగా వున్నారు...కాబట్టి సీనియర్లు ఒళ్ళుదగ్గరపెట్టుకుని ఆడాలని హెచ్చరించాడు.  

తాజాగా ప్రకటించిన పాక్ జట్టుకు కెప్టెన్ గా సర్పరాజ్ అహ్మదే వ్యవహరించనున్నాడు. అయితే ఇటీవలే భారతీయ సంతతి యువతిని పెళ్లాడిన హసన్ అలీకి జట్టులో చోటు దక్కలేదు. అలాగే సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ ను కూడా పక్కనబెట్టిన సెలెక్టర్లు బౌలర్ అమీర్ పై మాత్రం నమ్మకముంచారు. 

''శ్రీలంక జట్టు సీనియర్లతో బలంగా వుంటుందా? జూనియర్లతో బలహీనంగా వుంటుందా? అన్న ఆలోచనే మా దృష్టిలో లేదు. ఎలాంటి జట్టునయినా ఎదుర్కోగల సత్తా వున్న ఆటగాళ్లనే ఎంపిక చేయాలనుకున్నాం. అదే చేశాం. గతంలోనే ప్రపంచ కప్ ఆడాల్సిన ఐదుగురు జూనియర్లకు తాజాగా అవకాశం కల్పించాం. అన్ని విభాగాల్లో బలంగా వుండేలా ఆటగాళ్ల ఎంపికను చేపట్టాం. స్వదేశంలో చాలాకాలం తర్వాత జరుగుతున్న ఈ వన్డే సీరిస్ లో పాక్ విజేతగా నిలవడం ఖాయం.'' అని మిస్బా  పేర్కొన్నాడు. 

పాకిస్థాన్ టీం:

బాబర్ ఆజమ్, అబిద్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హరీస్ సోహైల్, ఇప్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, ఇమాముల్ హక్, మహ్మద్ అమీర్, మహ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్ , షాదాన్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్ 

click me!