అప్పుడు పారిపోయారు.. ఇప్పుడు పరిహారం ఇస్తున్నారు.. పాక్ కు నష్టనివారణ చెల్లించనున్న కివీస్

By Srinivas MFirst Published May 19, 2022, 8:18 PM IST
Highlights

PCB Gets Compensation: గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వచ్చి మధ్యలోనే అర్థాంతరంగా  టూర్ ను క్యాన్సిల్ చేసుకుని వెళ్లిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆ నష్టాన్ని భరించేందుకు ముందుకొచ్చింది. 

గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వచ్చి  మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భద్రతా కారణాలు చెప్పి టూర్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న వెళ్లిన  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పడు   నష్టనివారణ చర్యలకు దిగింది. తమ వల్ల నష్టపోయిన పాక్ కు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. ఇదే వ్యవహారానికి సంబంధించి .. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు లేఖ రాసింది. తమ వల్ల నష్టపోయిన  పీసీబీ కి పరిహారం చెల్లిస్తామని తెలిపింది. 

గతేడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. రావల్పిండిలో తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది.  ఆటగాళ్లంతా టీమ్ హోటల్ కు చేరుకున్నారు.  కానీ అనూహ్యంగా.. భద్రతా కారణాల వల్ల తాము ఈ టూర్ ను రద్దు చేసుకుంటున్నామని  ఉన్నఫళంగా వెల్లింగ్టన్ (న్యూజిలాండ్)  విమానమెక్కింది. 

పీసీబీ తో పాటు అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  సైతం న్యూజిలాండ్  బోర్డుతో, ఆ దేశ ప్రధాని తో కూడా మాట్లాడాడు. ప్రపంచంలో ఎవరికీ లేని భద్రతా నెట్వర్క్ తమ సొంతమని, కివీస్ ఆటగాళ్ల  మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా కివీస్ మాత్రం పాక్ మాట పెడచెవిన పెట్టింది.  ఈ చర్యతో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లడమే గాక అంతర్జాతీయంగా కూడా నవ్వులపాలైంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. కివీస్ చెప్పిన కారణమే చూపి ఇంగ్లాండ్ కూడా తమ పాక్ టూర్ ను క్యాన్సిల్ చేసుకుంది. 

అయితే  కివీస్ పాక్ పర్యటన రద్దుపై పాక్ మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్ లో కివీస్ ను తుక్కుతుక్కుగా ఓడించాలని వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగానే గ్రూప్ స్టేజ్ లో కివీస్ తో జరిగిన మ్యాచ్ లో పాక్.. కివీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. 

ఇదిలాఉండగా.. పాక్ కు తాజాగా కివీస్ ఎంత చెల్లిస్తుంది..? అనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. హోటల్ రూమ్ ల బుకింగ్స్, సెక్యూరిటీ, మార్కెటింగ్, బ్రాడ్కాస్ట్ ఇతర ఖర్చులకు సంబంధించి కివీస్ బోర్డు.. పీసీబీ కి పరిహారం చెల్లించనుంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కు ముందు.. పాక్-కివీస్-బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ ఆడేందుకు కూడా ఒప్పుకుంది.  ఇది ముగిసిన తర్వాత డిసెంబర్ లో పాక్ పర్యటనకు రానుంది కివీస్. డిసెంబర్ లో పాక్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో ఇంగ్లాండ్ కూడా ఏడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు పాక్  కు రానున్నది. ఇటీవలే పాక్ లో పర్యటించిన ఆస్ట్రేలియా విజయవంతమైన నేపథ్యంలో పాకిస్తాన్ కు మళ్లీ విదేశీ జట్లు విరివిగా క్యూ కడుతున్నాయి.  ఈ జూన్ లో  పాక్ తో మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ కూడా రానున్నది. చూస్తుంటే పాక్ క్రికెట్ కు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టే కనిపిస్తున్నది. 

click me!