Crypto Currency: వాటితో స్పాన్సర్ షిప్ వద్దే వద్దు.. యాడ్స్ కూడా నిషేధమే.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ ఆదేశం?

By team teluguFirst Published Nov 26, 2021, 6:58 PM IST
Highlights

BCCI-Bit Coin: వచ్చే ఏడాది  ఏప్రిల్ లో జరుగబోయే ఐపీఎల్ లో పాల్గొనబోయే ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్  కరెన్సీ, బెట్టింగ్ కు సంబంధించిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని తేల్చి  చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ కొత్త రూపం సంతరించుకుంటున్నది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన నేపథ్యంలో ఆర్థిక విపణిలో Digital Currency దూసుకువస్తున్నది.  మునపటిలా కరెన్సీ నోట్లు కాకుండా ఆన్లైన్ కాయిన్స్ ప్రపంచాన్ని శాసించబోతున్నాయి.  పలు పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే ఒక రూపం తీసుకున్న ఈ  డిజిటల్ కరెన్సీ Indiaలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నది.  క్రిప్టో కరెన్సీ (Crypto Currency) అని, డిజిటల్ కరెన్సీ అని, బిట్ కాయిన్స్ (Bit Coins) అంటూ వివిధ రూపాలలో ఉన్నా సారం మాత్రం ఒక్కటే. అయితే దీని మనుగడ, కార్యకలాపాలపై  ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  భారత ప్రభుత్వం (Central Government) కూడా దీనిపై ఓ కన్నేసింది. ఈ నేపథ్యంలో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు  (బీసీసీఐ) కూడా అలర్ట్ అయింది. ఏ రూపంలో ఉన్న  డిజిటల్ కరెన్సీలతో స్పాన్సర్షిప్ లను కుదుర్చుకోకూడదని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కంపెనీలతో స్పాన్సర్షిప్ డీల్స్ కుదుర్చుకోకూడదని IPL ఫ్రాంచైజీలకు BCCI ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెట్టింగ్ కంపెనీ (IPL Betting companies)లతో కూడా ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదని ఆజ్ఞాపించింది. 

డిజిటల్ కరెన్సీ కారణంగా ఇటీవల  ఆర్థిక నేరాలు అధికమవుతున్నాయి. బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతున్న చాలామంది అమాయకులు వాటి మీద అవగాహన లేక లక్షలకు లక్షలు కోల్పోతున్నారు.  వినియోగదారుల అవగాహన లేమిని ఆసరాగా తీసుకుని డిజిటల్ ఆర్థిక నేరగాళ్లు మితిమీరిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో మొదలుకాబోయే  పార్లమెంటు శీతాకాల సమావేశాలలో డిజిటల్ కరెన్సీకి సంబంధించిన నియమ నిబంధనలు, ఇతర అంశాలతో కూడిన ఓ బిల్లును కూడా తీసుకురానున్నది. 

ఇక బీసీసీఐ విషయానికొస్తే.. ‘డిజిటల్ కరెన్సీ, బిట్ కాయిన్ కంపెనీలతో ఎటువంటి స్పాన్సర్షిప్ డీల్స్ కుదుర్చుకోవడానికి వీలులేదని మేమిప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, వాటాదారులకు ఆదేశాలిచ్చాం.అంతేగాక కొన్ని బెట్టింగ్ కంపెనీలతో కూడా ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవాలని తెలిపాం. భవిష్యత్ లో కూడా వాటిని అనుమతించబోం..’ అని  ఓ బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపాడు. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో మ్యాచులు జరుగుతుండగా మధ్యలో కొన్ని డిజిటల్ కరెన్సీ కంపెనీలకు సంబంధించిన యాడ్స్ కూడా టీవీ, హాట్ స్టార్ లో వచ్చాయి. అయితే  తర్వాత సీజన్ నుంచి వాటిని కూడా నిషేధించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ మేరకు ఐపీఎల్ రెగ్యులేషన్ బాడీ..  స్టార్ నెట్వర్క్, డిస్నీ హాట్ స్టార్ లకు కూడా ఆదేశాలిచ్చినట్టు సమాచారం.  అయితే వాటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి రిప్లై రాలేదు. ఈ విషయంలో అవి ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది. 

క్రిప్టో కరెన్సీ కి చెందిన పలు సంస్థలు క్రీడలకు స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. అవేంటంటే.. 
-  బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్,  జువెంటస్, ఇంటర్ మిలాన్, ఎసీ మిలాన్, అర్సెనాల్ అండ్ మాంచస్టర్ సిటీ... (ఇవన్నీ ఫుట్ బాల్ లీగ్ లకు సంబంధించిన జట్లు) లకు క్రిప్టో కరెన్సీ సంస్థలు స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. 
- ఈ ఏడాది భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం  తెలిసిందే.  ఈ సిరీస్ కు కాయిన్ డీసీఎక్స్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 
- యూరో కప్ 2021 లో వజిర్ఎక్స్ కు చెందిన యాడ్స్ ప్లే అయ్యాయి. 
- జూన్ లో జరిగిన ఎఫ్1 రేసుకు క్రిప్టో.కామ్ స్పాన్సర్షిప్ చేసింది. 

click me!