Shreyas Iyer: డాన్స్ తో ఇరగదీసిన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్.. వీడియో షేర్ చేసిన హిట్ మ్యాన్

By team teluguFirst Published Nov 26, 2021, 4:42 PM IST
Highlights

Rohit Sharma: కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు.  భారత టీ20 సారథి రోహిత్ శర్మ అతడికి తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపాడు. 

భారత టెస్టు క్రికెట్ లోకి 303వ ఆటగాడిగా కాన్పూర్ టెస్టులో అరంగ్రేటం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆడిన తొలి మ్యాచులోనే సెంచరీతో కదం తొక్కాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు  ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ముంబయి కుర్రాడు.. రాకరాక వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. భారత టాపార్డర్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతున్న వేళ.. సెంచరీతో చెలరేగాడు.  అయ్యర్  ప్రదర్శనపై తాజా,మాజీ క్రికెటర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా  భారత టీ20 జట్టు సారథి రోహిత్ శర్మ కూడా అయ్యర్ కు  తన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపాడు. 

ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన రోహిత్ శర్మ.. తాను,  శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు.  వీడియోకు ‘చాలా బాగా ఆడావు శ్రేయస్.. అంతా సవ్యంగానే సాగుతోంది..’ అని  క్యాప్షన్ పెట్టాడు. 

 

ఈ వీడియోలో అయ్యర్, హిట్ మ్యాన్, శార్దుల్ లు కలిసి ఇన్స్టాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ‘Koi Sehri Babu dil..’ అనే రీల్ కు స్టెప్పులేశారు.  డాన్స్ లో ఇరగదీసే అయ్యర్.. ఈ పాటకూ అదరగొట్టాడు. వీడియోలో అయ్యర్ ముందుండగా.. రోహిత్, శార్దుల్ లు వెనకాల ఉన్నారు. స్టెప్పులతో అయ్యర్ వావ్ అనిపించగా.. రోహిత్, శార్దుల్ లు కూడా కాలు కదిపారు. రోహిత్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. 

కాగా.. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ నిలకడగా ఆడుతున్నది. రెండో రోజు లంచ్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆ జట్టు ఓపెనర్లు సంయమనంతో ఆడుతున్నారు. 55 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 128 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (157 బంతుల్లో 50 నాటౌట్), విల్ యంగ్ (176 బంతుల్లో 74 నాటౌట్) క్రీజులో పాతుకుపోయారు. కివీస్ బౌలర్లు చెలరేగిన చోట భారత స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ లతో పాటు పేసర్లు ఉమేశ్, ఇషాంత్ లు తేలిపోతున్నారు. అంతుకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 345 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. శ్రేయస్ (105) సెంచరీ చేయగా.. గిల్ (52), జడేజా (50), అశ్విన్ (38) రాణించారు.

click me!