భారత్ కు కొవిడ్ కొత్త వేరియంట్ దెబ్బ.. సౌతాఫ్రికాకు వెళ్లాలా.. వద్దా? కేంద్రం అనుమతి కోసం చూస్తున్న బీసీసీఐ

By team teluguFirst Published Nov 26, 2021, 5:36 PM IST
Highlights

India Tour Of South Africa: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ కారణంగా వచ్చే నెలలో వెళ్లాల్సిన ఈ పర్యటనకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిమీద  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎటూ తేల్చుకోలేకపోతున్నది. 

మాయదారి మహమ్మారి కరోనా (Covid-19) రక్కసి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం  సేదతీరుతున్న వేళ దక్షిణాఫ్రికా (South Africa) లో  కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్తలు మళ్లీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీ.1.1.529 వేరియంట్ గా చెబుతున్న ఇది దక్షిణాఫ్రికాలో వెలుగుచూడటం.. ఇప్పటికే అక్కడ పలు కేసులు కూడా నమోదై పక్కనున్న దేశాలకూ విస్తరిస్తుండటంతో మరో కొవిడ్ ముప్పు తప్పేలా లేదని ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఈ వేరియంట్ లోని అధిక మ్యూటేషన్ల కారణంగా.. ఇది పాత వేరియంట్ల కంటే వేగంగా  వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయన్న వార్తలు ప్రపంచానికి మళ్లీ షాక్ తెప్పిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ దెబ్బ తాజాగా భారత క్రికెట్ (Indian Cricket) కు కూడా తాకింది.

భారత జట్టు వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమైతే డిసెంబర్ 8న  భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా విమానం ఎక్కాలి. కానీ తాజాగా అక్కడ కొవిడ్ కొత్త వేరియంట్ కారణంగా ఈ పర్యటనకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిమీద  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఎటూ తేల్చుకోలేకపోతున్నది.  ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన బీసీసీఐ.. కేంద్ర నిర్ణయం కోసం వేచి చూస్తున్నది. 

కొత్త వేరియంట్ ఎక్కడిది..? 

బీ.1.1.529 కొత్త వేరియంట్ ను మొదట దక్షిణాఫ్రికాలోనే గుర్తించారు. ఈ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందనేదానిపై ఇప్పటిదాకా శాస్త్రీయ ఆధారాలు గుర్తించనప్పటికీ.. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తక్కువగా ఉన్న హెచ్ఐవీ/ఎయిడ్స్ పేషెంట్ నుంచి  ఇది పుట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా లో సుమారు 8.2 మిలియన్ల (80 లక్షలకు పైగా) కు పైగా హెచ్ఐవీ బాధితులున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులున్న దేశం కూడా ఇదే.  తాజాగా బయటపడ్డ బీ.1.1.529 వేరియంట్ కూడా వారిలో ఎవరో ఒకరి నుంచి వచ్చి ఉంటుందని లండన్ లోని యూసీఎల్ జెనిటిక్స్ ఇనిస్టిట్యూట్ చెబుతున్నది. 

ఇప్పటికే వందకు పైగా కేసులు : 

బీ.1.1.529 వేరియంట్ కు సంబంధించి దక్షిణాఫ్రికాలో ఇప్పటికే వందకు పైగా కేసులను గుర్తించారు. ఆ దేశంలో కొత్తగా కరోనా బారిన పడుతున్న వారిలో ఇదే వేరియంట్ ను గుర్తిస్తున్టట్టు అధికారులు చెబుతున్నారు. ఇది దక్షిణాఫ్రికాకే పరిమితం  కాలేదు. ఆ దేశానికి పక్కనే ఉన్న బోట్స్వానాలో కూడా నాలుగు కేసులను గుర్తించారు. హాంకాంగ్ లో కూడా రెండు కేసులు వెలుగు చూశాయి. వైరస్ సోకినవాళ్లలో చాలా మంది ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో ఇది మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.  

షెడ్యూల్ ఇలా.. 

కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ ప్రొటీస్ జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడుతుంది. తొలి టెస్టు డిసెంబర్ 17న మొదలుకానుండగా తొలి వన్డే జనవరి 14న జరగాల్సి ఉంది. టీ20లు జనవరి 19 నుంచి మొదలై 26 వరకు ముగుస్తాయి. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు దక్షిణాఫ్రికాలోనే ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వేరియంట్  ఎలా ఉత్పరివర్తనం చెందుతుంది..? దాని వ్యాప్తి ఎలా ఉంటుంది..? అనేదానిమీద బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే భారత-ఏ జట్టు దక్షిణాఫ్రికా-ఏ తో అక్కడ ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్నది.  ఒకవేళ బీ.1.1.529 కేసులు పెరిగితే  అక్కడున్న జట్టును కూడా వెనక్కి పిలిచే అవకాశముంది. మరి దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

సుమారు రెండేళ్లుగా ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా నుంచి  క్రీడాలోకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.  ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ తో పాటు చాలా క్రీడలు ఆంక్షల నడుమే సాగుతున్నాయి. ఇక  క్రికెటర్లు అయితే బయో బబుల్ జీవితాలకు అలవాటు పడలేక నానా  కష్టాలు పడుతున్నారు. బయో బబుల్ కష్టాల వల్ల భారత క్రికెట్ జట్టుకు ఎనలేని నష్టం చేకూరింది. సుమారు ఆరు నెలలుగా బబుల్ ఆంక్షల నడుమ అలసిపోయిన భారత ఆటగాళ్లు.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో దారుణంగా వైఫల్యం చెందారు. 

click me!