
టీమిండియా టెస్టు క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది సంచలనమే. ఇండియాలో అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ అలాంటిది మరి. అయితే కోహ్లీ గురించి వచ్చే వార్తలలో నిజాలకంటే రూమర్సే ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ఒకటి ‘విరాట్ కు ప్రైవేట్ జెట్ ఉంది’.. అని. దీంతోపాటు విరాట్ పాపులర్ వెబ్ షో ‘మనీ హైస్ట్’ లో నటించాడని.. ఈ ప్రశ్నలన్నింటికీ అతడు సమాధానం చెప్పాడు.
దక్షిణాఫ్రికా పర్యటనతో బిజీబిజీగా ఉన్న విరాట్ కోహ్లీ.. టైం దొరికితే యాడ్ షూట్స్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు తాజాగా.. పూమా యాడ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అతడిని పలు ప్రశ్నలు అడిగారు. కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ విషయాలపై కోహ్లీ స్పష్టతనిచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఫన్ కూడా ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ముందు విరాట్.. హీలియంను పీల్చి ఆన్సర్ చేయాలి. హీలియం పీల్చితే గొంతు సాధారణంగా మనం మాట్లాడేదానికంటే భిన్నంగా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇదే ఈ యాడ్ షూట్ లో స్పెషల్.
కోహ్లీకి ప్రైవేట్ జెట్ ఉందా..? అన్న ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. ‘లేదు. అవన్నీ రూమర్లే..’ అని చెప్పాడు. ఇక కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతాడా అని అడుగగా.. ‘అప్పుడప్పుడు..’ అని తెలిపాడు.
ఇక పాపులర్ వెబ్ సిరీస్ మనీ హైస్ట్ లో కోహ్లీ నటించాడా..? అని అడగ్గా.. ‘లేదు. నేను నటించలేదు. ఆ సిరీస్ లో ప్రొఫెసర్ లా ఉన్నది నేను కాదు. నన్ను పోలిన వ్యక్తి..’ అని చెప్పాడు. చిన్నప్పుడు తాను స్కూళ్లో టాపర్ కాదని, కానీ బుద్దిగా మాత్రం ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా.. ఈనెల 26న మొదలుకానున్న తొలి టెస్టు కోసం కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో విసుగు చెందిన కోహ్లీ ఈ సిరీస్ లో రాణించి విమర్శకుల నోళ్లు మూయించాలని భావిస్తున్నాడు. అదీగాక రెండేండ్లుగా సెంచరీ చేయడం లేదనే అపప్రదను చెరిపేసుకోవడానికి కూడా విరాట్ కు ఇది సదావకాశం.