
టీ20 క్రికెట్ అంటేనే వినోదానికి పక్కా చిరునామా. ఆట విషయం పక్కనబెడితే ఆటగాళ్ల మధ్య సరదా సన్నివేశాలు, ప్రత్యర్థుల మధ్య వాగ్వాదాలు, క్రికెటర్ల డాన్సులు, వాళ్ల బావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి. బ్యాటర్లు ఎంత హిట్టింగ్ చేసినా.. బౌలర్లు ఎన్ని వికెట్లు పడగొట్టినా.. ఫీల్డర్లు కండ్లు చెదిరిపోయే క్యాచులు పట్టినా.. ఆన్ ది ఫీల్డ్ లో జరిగే ఆఫ్ ది ఫీల్డ్ ఘటనలు ప్రేక్షకులకు ఫన్ ను పంచుతాయి. ఇక బిగ్ బాష్ వంటి భారీ లీగ్ లో వీటి గురించి ప్రత్యేకించి చెప్పాలా..? తాజాగా ఈ లీగ్ లో ఓ జట్టు కెప్టెన్.. బౌలర్ కు ముద్దు పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరలవుతున్నది.
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా.. డిసెంబర్ 21న సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్.. 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు కెప్టెన్ పీటర్ సిడిల్.. తొలి ఓవర్ ను డేనియల్ ఓర్రల్ తో వేయించాడు. తొలి బంతి వేసిన తర్వాత అతడి దగ్గరికెళ్లిన సిడిల్.. ఓర్రల్ తో కాసేపు ముచ్చటించాడు. అనంతరం అతడి చెంపపై ముద్దు పెట్టి అక్కడ్నుంచి ఫీల్డింగ్ కు వెళ్లాడు.
ఇది కాస్తా అక్కడి కెమెరాలకు చిక్కింది. సిడిల్.. ఓర్రల్ కు ముద్దు పెడుతున్న క్లిప్ ను కట్ చేసి ఇంటర్నెట్ లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ మాత్రం తలోరకంగా స్పందిస్తున్నారు. ‘ఆట మధ్య మీ బ్రొమాన్స్ ఏంది బ్రో.. తట్టుకోలేకపోతున్నాం.. ముందు మ్యాచ్ సంగతి చూడండి..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఈ మ్యాచులో సిడ్నీ సిక్సర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదలు బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్.. 20 వ ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆ జట్టులో థామస్ కెల్లీ (41) టాప్ స్కోరర్. అనంతరం సిడ్నీ సిక్సర్స్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోర్డాన్ సిల్క్ (36), మోయిసెస హెన్రిక్స్ (28) రాణించారు.