ఐపీఎల్ 2024: ఆరు జ‌ట్ల‌కు కొత్త సార‌థులు.. 10 జ‌ట్ల కెప్టెన్లు వీరే.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 21, 2024, 8:49 PM IST

Captains of 10 Teams in IPL 2024: ఐపీఎల్ 2024 కోసం మొత్తం 10 జట్లు త‌మ కెప్టెన్ల‌ను ఖరారు చేశాయి. 6 జట్లుకు కొత్త సార‌థులు వ‌చ్చారు. ఊహించ‌ని విధంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ సైతం ఎంఎస్ ధోని స్థానంలో కొత్త కెప్టెన్ ప్ర‌క‌టించి అందిరికీ షాక్ ఇచ్చింది. 
 


IPL 2024 Captains List : గత కొన్ని సీజన్లతో పోలిస్తే రాబోయే ఐపీఎల్ ఎడిషన్ చాలా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈసారి ఆటగాళ్ల వేలంలో రికార్డులు బ‌ద్ద‌లుకొట్టారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, ఈ సారి 10 జ‌ట్ల‌లోని 6 టీమ్ ల‌కు కొత్త సార‌థులు వ‌చ్చారు. రాబోయే సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ ట్రోఫీతో మొత్తం 10 జట్ల కెప్టెన్ల ఫోటోను సంబంధిత వ‌ర్గాలు పంచుకున్నాయి. ఇందులో స‌గానికి పైగా కొత్త ముఖాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 లో వివిధ జ‌ట్ల కెప్టెన్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

చెన్నై సూపర్ కింగ్స్ 

Latest Videos

ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు జట్టు కెప్టెన్‌ను మార్చింది. సీఎస్కే జట్టుకు కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని నియమించింది. ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా ఆడటం చూడ‌వ‌చ్చు. దీంతో బహుశా ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా రావ‌చ్చు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ 

ఢిల్లీ క్యాపిటల్స్  కు ఐపీఎల్ 2023లో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అయితే, ఈసారి 
జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ వ‌చ్చేశాడు. గత సీజన్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 

ముంబై ఇండియన్స్

ఐపీఎల్ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మ గత 10 సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఐదుసార్లు టైటిల్ అందించాడు. కానీ, ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రోహిత్ ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నాడు. 

కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ సైతం కెప్టెన్సీలో మార్పు చేసింది. శ్రేయాస్ అయ్యర్‌పై జట్టు మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2023లో జట్టుకు నితీష్ రాణా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో జట్టు ప్రదర్శన మెరుగ్గా లేక‌పోవ‌డంతో కెప్టెన్సీ మార్పులు చేసింది. గ‌త సీజ‌న్ లో కోల్ క‌తా 14 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి, 8 ఓడిపోయింది. 

ఆ త‌ప్పులు చేసింది ఎంఎస్ ధోని.. రోహిత్ కాదు.. !

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ గత కొన్నేళ్లుగా చాలా మంది కెప్టెన్‌లను మార్చింది, కానీ జట్టుకు విజయాలు దక్కలేదు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ తర్వాత ఐడెన్ మార్క్‌రామ్ ను కెప్టెన్ గా చేసింది. అయినా జ‌ట్టు మెరుగైన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో ఐపీఎల్ 2024 కోసం రికార్డు ధ‌ర‌ను చెల్లించి పాట్ కమ్మిన్స్ ను ద‌క్కంచుకుని జట్టు కెప్టెన్‌గా చేసింది. గత సీజన్‌లో మెరుగైన జట్టు కూర్పు ఉన్నప్పటికీ, జట్టు చివరి స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో 10 ఓడిపోయింది. 

గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ కూడా తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. జట్టు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు బ‌దిలీ చేసిన త‌ర్వాత కొత్త కెప్టెన్‌గా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను నియమించింది. ఇప్ప‌టివ‌ర‌కు గుజ‌రాత్ వ‌రుస‌గా రెండు సార్లు ఫైన‌ల్ కు చేరుకోగా, ఒక‌సారి టైటిల్ గెలుచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులో మార్పులు చేసినప్పటికీ వారు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే సీజన్‌లో కేఎల్ రాహుల్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. 

రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు కమాండ్‌ను సంజూ శాంసన్‌కు అప్పగించింది. అతని నాయకత్వంలో జట్టు బాగా ఆడింది. గత సీజన్‌లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించింది. అయితే ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

పంజాబ్ కింగ్స్ 

పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లో శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈసారి కూడా జట్టు అతనిపై విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే జట్టు వైస్ కెప్టెన్‌ని మార్చారు. సామ్ కుర్రాన్ ఇంతకుముందు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు, అయితే ఈసారి జితేష్ శర్మను జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ 2022కి ముందు విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గత సీజన్‌లో ఫాఫ్ నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శన చేసినా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 14 మ్యాచ్‌లలో ఏడింటిని గెలుచుకుంది.

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్..  

click me!