Ind Vs SA: మూడో రోజు మూడింది.. బాక్సింగ్ డే టెస్టులలో రెండు అగ్ర జట్ల పేలవ ప్రదర్శనపై నెటిజన్ల ట్రోల్స్

Published : Dec 28, 2021, 04:47 PM IST
Ind Vs SA: మూడో రోజు మూడింది.. బాక్సింగ్ డే టెస్టులలో రెండు అగ్ర జట్ల పేలవ ప్రదర్శనపై నెటిజన్ల ట్రోల్స్

సారాంశం

India Vs South Africa: యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో  ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లాండ్ తో మూడో టెస్టు మ్యాచ్ ను ఈనెల 26న ప్రారంభించింది.  దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు కూడా తొలి టెస్టును అదే తేదిన సెంచూరియన్ లో మొదలుపెట్టింది.

నాలుగు అగ్రశ్రేణి జట్లు...  మూడు రోజుల క్రితం ఒకేసారి వారి ప్రత్యర్థులతో టెస్టులను ప్రారంభించాయి. అందులో ఓ జట్టు.. నిర్ణయాత్మక టెస్టులో బొక్కబోర్లా పడితే మరో టీమ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించింది. వచ్చినోళ్లు వచ్చినట్టు.. స్కూల్ లో అటెండెన్స్ వేసుకుని తప్పించుకున్నట్టే వచ్చి వెళ్లారు. ఈ రెండు జట్లలో ఒకటి అపజయం పాలై సిరీస్ ను కోల్పోగా మరో జట్టు పటిష్ట స్థితి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఆ రెండు జట్లే ఇంగ్లాండ్, టీమిండియా... 

యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో  ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లాండ్ తో మూడో టెస్టు మ్యాచ్ ను ఈనెల 26న ప్రారంభించింది.  దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు కూడా తొలి టెస్టును అదే తేదిన సెంచూరియన్ లో మొదలుపెట్టింది. తొలి రోజు భారత ఆటగాళ్లు బాగానే ఆడినా మూడో రోజు మాత్రం (రెండో రోజు వర్షార్పణం అయింది) 46 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజు 278-3 గా ఉన్న టీమిండియా.. మూడో రోజు తొలి సెషన్ కూడా ముగియకముందే.. 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్.. ఓవర్ నైట్ స్కోరు 31-4 తో ఉండగా.. 68 పరుగులకు పెవిలియన్ కు చేరింది. 

 

యాషెస్ కోల్పోవడంపై ఇంగ్లాండ్ అభిమానులు జో రూట్ సేనపై దుమ్మెత్తి పోస్తుండగా..  టీమిండియాను అమితంగా అభిమానించే భారత అభిమానులు కూడా  మన క్రికెటర్లను ఓ ఆటాడుకుంటున్నారు. గంట సేపట్ల్లోనే ఆలౌట్ అయిన మనోళ్ల ప్రతిభను చూసి మెచ్చుకోలేకుండా ఉన్నామంటూ సెటైర్లు పేల్చుతున్నారు. 

ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్ల కామెంట్లు ఇలా ఉన్నాయి.. ‘ఇది టెస్టు క్రికెట్ పతనం.. మొదలు ఎంసీజీ (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్) ఇప్పుడు సెంచూరియన్..’, ‘ఒకవేళ క్రీజులో పాతుకుపోతే టెస్టు డ్రా అవుతుందని అనుకున్నారేమో...’ ‘ఇంగ్లాండ్ కు నివాళి అర్పిస్తున్నారా..?’, ‘లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై విక్రమ్ రాథోడ్ (టీమిండియా బ్యాటింగ్ కోచ్) బాగా దృష్టిసారించాడు.. ’ అని కామెంట్లు చేస్తున్నారు. 

 

కాగా.. 272 పరుగులతో మూడో  రోజు ప్రారంభించిన టీమిండియాను రబాడా తొలి దెబ్బ తీశాడు. అతడు  కెఎల్ రాహుల్ (123) ఔట్ చేసిన  తర్వాత భారత  బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఎంగిడి దాటికి రహానే (48), పంత్ (8) లు త్వరగానే పెవిలియన్ కు చేరగా.. ఆ తర్వాత రబాడ అశ్విన్ (4), శార్దుల్ (4) లను ఔట్ చేశాడు. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న దక్షిణాఫ్రికా కూడా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా..  సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ (1) ను ఔట్ చేశాడు. ఆ తర్వాత షమీ.. మార్క్రమ్ (13), పీటర్సన్ (15) లను పెవిలియన్ కు పంపాడు. 12 ఓవర్లు ముగిసేసరికి  సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. డసెన్ (1*), బవుమా (0*) క్రీజులో ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు