
క్రికెట్ చరిత్రలో అభిమానులకు అసలైన మజాను పంచే టెస్టు క్రికెట్ లో ఇంగ్లాండ్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఆ జట్టు అపజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నది. వన్డే, టీ20 లలో మెరుగైన ప్రదర్శనలు సాధిస్తున్న ఇంగ్లీష్ జట్టు.. టెస్టులలో మాత్రం పేలవ ప్రదర్శనతో అపజయాలు మూటగట్టుకుంటున్నది. ఈ అపజయాలకు అందరూ వేలెత్తి చూపుతున్న వ్యక్తి జో రూట్. అతడే ఆ జట్టుకు కెప్టెన్ మరి... అయితే కెప్టెన్ గా జట్టును గెలిపించలేకపోతున్న రూట్.. బ్యాటర్ గా మాత్రం అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్నాడు.
ఈ ఏడాది టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో జో రూట్ అగ్రస్థానం. 2021 క్యాలెండర్ ఇయర్ లో జో రూట్.. ఏకంగా 1,708 పరుగులు చేసి ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ (19 ఇన్నింగ్సులలో 1,788 పరుగులు), విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (19 ఇన్నింగ్సులలో 1,710 రన్స్) ఉన్నారు.
59 టెస్టులలో ఇంగ్లాండ్ కు సారథ్యం వహించిన జో రూట్.. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన సారథులలో ఒకడు. 47.78 సగటుతో అతడు 4,921 రన్స్ చేశాడు. ఇక తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ తరఫున అతడే టాప్ స్కోరర్. మూడు టెస్టులలో రూట్.. 253 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి.
కానీ నాయకుడిగా అట్టర్ ఫ్లాఫ్..
బ్యాటర్ గా అద్భుతాలు చేస్తున్న రూట్.. నాయకుడిగా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 2021 లో రూట్ నాయకత్వంలో ఇంగ్లాండ్ 15 టెస్టులాడింది. ఇందులో నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 9 టెస్టులు ఓడింది. రెండు డ్రా చేసుకుంది. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక టెస్టులు ఓడిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ రికార్డు గతంలో బంగ్లాదేశ్ పేరిట (2003లో బంగ్లాదేశ్ 9 టెస్టులు ఓడింది) ఉండేది.
ఈ ఏడాది ఇంగ్లాండ్ ఓటముల పరంపర ఇలా..
- శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్ ను 2-0తో గెలుచుకుంది.
- టీమిండియాతో భారత్ లో జరిగిన సిరీస్ ను 3-1తో కోల్పోయింది.
- న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ లోనే జరిగిన సిరీస్ ను కూడా 0-1 తో ఓడింది.
- ఇటీవలే ఇండియాతో అర్థాంతరంగా ముగిసిన సిరీస్ లో 2-1 తో వెనుకంజలో ఉంది.
- ఇప్పుడు యాషెస్ లో 0-3 తో (మరో రెండు టెస్టులున్నాయి) సిరీస్ కోల్పోయింది.
నాయకత్వ మార్పు తప్పదా..?
వరుస ఓటములతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా రూట్ ను తప్పించాలని చూస్తన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ టీ20, వన్డే జట్టు సారథి ఇయాన్ మెర్గాన్ అద్భుత ఫలితాలు సాధిస్తుంటే మరోవైపు రూట్ మాత్రం అపజయాల పరంపరను ముందుకు తీసుకెళ్తుండటంపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారు. యాషెస్ తర్వాత రూట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా యాషెస్ పోవడంతో అతడికి చెక్ పెట్టాల్సిందేనని ఈసీబీ అనుకుంటున్నది.
మెల్బోర్న్ ఓటమితో పలువురు ఇంగ్లాండ్ మాజీలు స్పందిస్తూ.. ‘జట్టులో సమూల మార్పులు తప్పవు. ముఖ్యంగా కెప్టెన్ రూట్ కు ఇక సెలవు ఇవ్వాల్సిందే..’అని వ్యాఖ్యానించడం నాయకత్వ మార్పుకు సూచికగా కనిపిస్తున్నది. ఒకవేళ రూట్ ను కెప్టెన్ గా తప్పిస్తే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించవచ్చు.