టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించిన నేపాల్! ఏషియా క్వాలిఫైయర్స్‌లో...

By Chinthakindhi Ramu  |  First Published Nov 3, 2023, 3:53 PM IST

టీ20 వరల్డ్ కప్ 2024 ఏషియా క్వాలిఫైయర్స్‌లో ఫైనల్‌కి చేరిన నేపాల్, ఓమన్ జట్లు... తొలిసారి ఐసీసీ మెగా టోర్నీ ఆడబోతున్న నేపాల్.. 


నేపాల్ క్రికెట్ చరిత్రలో సరికొత్త శఖం లిఖించబడింది. మొట్టమొదటిసారిగా ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొన్న నేపాల్ జట్టు, వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించింది. అక్టోబర్ 30 నుంచి మొదలైన ఏషియా క్వాలిఫైయర్స్‌లో నేపాల్, ఓమన్ జట్లు ఫైనల్‌కి అర్హత సాధించాయి..

ఈ రెండు జట్లు కూడా వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఆడబోతున్నాయి. బెహ్రాయిన్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో విజయం అందుకుంది ఓమన్..

Latest Videos

undefined

బెహ్రాయిన్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఇమ్రాన్ ఆలీ 30, అహ్మీర్ నసీర్ 26, సర్ఫరాజ్ ఆలీ 23 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 14.2 ఓవర్లలోనే ఛేదించింది ఓమన్ జట్టు..

కశ్యప్ ప్రజాపతి 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా ప్రతీక్ అథర్వలే 42 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. 

సెమీ ఫైనల్ 2లో నేపాల్, యూఏఈపై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అరవింద్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేయగా మహ్మద్ వసీం 26 పరుగులు చేశాడు..

ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది నేపాల్. కుషాల్ బుర్టెల్ 11, గుల్షాన్ షా 22 పరుగులు చేయగా ఆసిఫ్ షేక్ 51 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు, కెప్టెన్ రోహిత్ పాడెల్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. 

ఫైనల్ చేరిన నేపాల్, ఓమన్ మధ్య నవంబర్ 5న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. యూరోప్ క్వాలిఫైయర్స్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించాయి. ఈస్ట్ ఏషియా-ఫసిఫిక్ క్వాలిఫైయర్స్ నుంచి పపువా న్యూ గినీ, అమెరికా క్వాలిఫైయర్స్ నుంచి కెనడా.. టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి.

మొట్టమొదటిసారిగా 2024 ప్రపంచ కప్‌లో 20 జట్లు పోటీపడబోతున్నాయి. నవంబర్ 22 నుంచి 30 వరకూ జరిగే ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి మరో 2 జట్లు, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి వస్తాయి.. 

click me!