Sri Lanka Crisis: లంకలో నిరసకారులకు ఐపీఎల్ కోచ్ ల మద్దతు.. నిరసనల్లో కుమార సంగక్కర భార్య

Published : Apr 04, 2022, 03:54 PM ISTUpdated : Apr 04, 2022, 03:55 PM IST
Sri Lanka Crisis: లంకలో నిరసకారులకు ఐపీఎల్ కోచ్ ల మద్దతు.. నిరసనల్లో కుమార  సంగక్కర భార్య

సారాంశం

Sri lanka Economic Crisis: శ్రీలంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం  మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది.  నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. దీనిని నిరసిస్తూ ఐపీఎల్ లో  పలు జట్లకు హెడ్ కోచ్ లుగా  వ్యవహరిస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్లు నిరసనకారులకు మద్దతుగా నిలుస్తున్నారు. 

ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని మునుపెన్నడూ లేని విధంగా  జాతీయ అత్యవసర పరిస్థితులను ఎదుర్కుంటున్న శ్రీలంకలో ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.  ఈ నిరసనలకు  అక్కడి ప్రజలతో పాటు లంక మాజీ క్రికెటర్లు.. ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్లకు హెడ్ కోచ్ లుగా, ఆటగాళ్లుగా ఉన్నవాళ్లు కూడా  మద్దతు పలుకుతున్నారు.  లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ పరిస్థితులకు కారణమయ్యారని వాళ్లు ప్రజా విశ్వాసం కోల్పోయారని  ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్  మహేళ జయవర్దనే పేర్కొన్నారు. జయవర్ధనే తో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. 

లంకలో ఆర్థిక పరిస్థితులు, నిరసనకారుల నిరసనల నేపథ్యంలో మహేళ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ‘లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.  ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం..  వారి నిత్యావసరాలను తీర్చడంలో పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న   న్యాయవాదులకు, విద్యార్థులకు నేను మద్దతు తెలుపుతున్నాను. 

 

నిజమైన నాయకులు తప్పులను  తమవిగా భావించాలి. దేశంలో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలు  మానవ సహితమే.  సమర్థవంతమైన వ్యక్తులు వాటిని పరిష్కరించగలరు.  కొంతమంది వ్యక్తులు లంక ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఈ పరిస్థితులకు కారణమయ్యారు. వాళ్లు ప్రజా విశ్వాసం కోల్పోయారు...’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

నా మనసంతా అక్కడే :  భానుక రాజపక్స

వృత్తి రీత్యా తాను చాలా మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ  లంక ప్రజల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ తన మద్దతు ఉంటుందని పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్స తెలిపాడు.  ప్రజల కష్టాలను వారి వేదనను తాను అర్థం చేసుకోగలనని, దానిని తాను కూడా అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

నిరసనల్లో కుమార సంగక్కర భార్య 

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇదే విషయమై స్పందిస్తూ.. ‘ప్రజల దుస్థితి చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది.  ప్రస్తుతం లంకలో ఉన్న పరిస్థితులపై కొందరు పోరాడుతుంటే మరికొందరేమో దానిని వాళ్లకు అనుకూలంగా మలుచుకుంటున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా సంగక్కర భార్య యహేలి.. సోమవారం లంక రాజధాని కొలంబోలో ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో నిరసనకారులతో కలిశారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు  చేస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపారు.  

ఈ సందర్భంగా సంగక్కర సతీమణి మాట్లాడుతూ... ‘వాళ్లు (లంక ప్రభుత్వం) దేశ యువత భవిష్యత్ ను శూణ్యం చేస్తున్నారు.  దీనికి చట్టసభ్యులైన 225 (లంక  పార్లమెంట్ లో సభ్యుల సంఖ్య) మంది బాధ్యులే..’ అని  ఆరోపించారు. 

శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పింది.  నిత్యావసర వస్తువులు  ధరలు భగ్గుమంటున్నాయి.  సూపర్ మార్కెట్లలో కిలో బియ్యం రూ. 220 కాగా.. గోధుమలు రూ. 190,  చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900 కు చేరింది. ఒక్క గుడ్డు  ధర రూ. 30 నుంచి రూ. 50 దాకా పలుకుతున్నది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది