
స్వదేశంలో బంగ్లాదేశ్ చేతుల్లో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా, తొలి టెస్టు ఘన విజయాన్ని అందుకుంది. అనేక వివాదాస్పద నిర్ణయాల మధ్య సాగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 220 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ 67 పరుగులు చేయగా ఓపెనర్ సరెల్ ఎర్వీ 41 పరుగులు చేశాడు. భవుమా 190 బంతుల్లో 12 ఫోర్లతో 93 పరుగులు చేసి, 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 4 వికెట్లు తీయగా మెహిడీ హసన్ 3 వికెట్లు, ఎబదత్ హుస్సేన్ రెండు వికెట్లు తీశారు. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 326 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 137 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకి ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్. షాంటో 38 పరుగులు చేయగా, లిటన్ దాస్ 41 పరుగులు చేశాడు.
సఫారీ బౌలర్లు సిమాన్ హర్మర్ 4 వికెట్లు తీయగా విలియమ్స్‌కి 3 వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 204 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 64 పరుగులు చేయగా ర్యాన్ రికెల్టన్ 39, కీగన్ పీటర్సన్ 36 పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 69 పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ముందు 274 పరుగుల టార్గెట్‌ను పెట్టింది దక్షిణాఫ్రికా. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్ చెలరేగిపోవడంతో 19 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్...
నజిముల్ హుస్సేన్ షాంటో 26 పరుగులు చేయగా టస్కీన్ అహ్మద్ 14 పరుగులు చేశాడు. మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసిన కేశవ్ మహరాజ్ 32 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సిమాన్ హర్మర్ 9 ఓవర్లలో 3 మెయిడిన్లతో 21 పరుగులిచ్చి మిగిలిన 3 వికెట్లు తీశాడు...
ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లో అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైనట్టే, మరోసారి సఫారీ అంపైర్లు పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆరోపించింది బంగ్లాదేశ్. అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాలు బంగ్లాకి వ్యతిరేకంగా రావడంతో ఇకనైనా న్యూట్రల్ అంపైర్లను అనుమతించాలని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన విధానం తీవ్ర వివాదాస్పదమైంది. అలాగే అంపైర్లు ప్రకటించిన కొన్ని నిర్ణయాలు భారత జట్టు విజయావకాశాలను దెబ్బ తీశారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇతర దేశాల అంపైర్లను అనుమతించాలనే డిమాండ్ మెల్లిమెల్లిగా పెరుగుతోంది.
కగిసో రబాడా, ఆన్రీచ్ నోకియా, ప్రెటోరియస్ వంటి కీ ప్లేయర్లు ఐపీఎల్ 2022 సీజన్ కోసం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి దూరంగా ఉన్నారు.