ధోనీ పేరుతో టీచర్ పోస్ట్‌కి ఆకతాయి దరఖాస్తు.. తండ్రిగా సచిన్ పేరు, బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం

By Siva KodatiFirst Published Jul 3, 2021, 8:43 PM IST
Highlights

ఆధార్ కార్డుల్లో, హాల్ టికెట్లలో సెలబ్రెటీల ఫోటోలు ప్రింట్ కావడం, పరీక్షల్లో ప్రముఖులు ప్రథమ శ్రేణిలో పాసవ్వడం వంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ ఇద్దరు సెలబ్రెటీలను ఒకే ఘటనలో తండ్రి కొడుకుల్ని చేసేశారు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వ అధికారులు.

ఆధార్ కార్డుల్లో, హాల్ టికెట్లలో సెలబ్రెటీల ఫోటోలు ప్రింట్ కావడం, పరీక్షల్లో ప్రముఖులు ప్రథమ శ్రేణిలో పాసవ్వడం వంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ ఇద్దరు సెలబ్రెటీలను ఒకే ఘటనలో తండ్రి కొడుకుల్ని చేసేశారు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వ అధికారులు. వాళ్లెవరో కాదు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ. మహీని సచిన్‌కి కొడుకుని చేసేశారు. 

వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించి ముఖాముఖి ఇంటర్య్వూకు దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి 15 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు. ఆ షార్ట్‌ లిస్ట్‌లో తొలిపేరు మహేంద్ర సింగ్‌ ధోని సన్నాఫ్‌ సచిన్‌ టెండూల్కర్‌ , రాజ్‌పూర్‌ జిల్లా అని రాసి ఉంది.

అప్లికేషన్‌ ప్రకారం ఎంఎస్‌ ధోని దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇలాంటి పేర్లతో అప్లికేషన్‌లు వచ్చినప్పడు కనీసం అక్కడి అధికారులు ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేయకపోవడం గమనార్హం. కాగా శుక్రవారం ఆ 15 మందిని ఇంటర్య్వూకు పిలిచారు. అయితే ధోని పేరుతో ఉన్న అభ్యర్థి ఇంటర్య్వూకు రాలేదు. దీంతో వారు అప్లికేషన్‌లో ఉన్న మొబైల్‌ నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది.

Also Read:మాహీ భాయ్ కోసం చావడానికైనా మేం రెఢీ... కెఎల్ రాహుల్ కామెంట్...

చివరికి తప్పు తెలుసుకున్న అధికారులు అప్లికేషన్‌ నకిలీదని గుర్తించారు. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ బిహార్‌లో టీచర్‌ జాబ్‌కు ఎంపికైనట్లుగా ఫోటో ప్రచురితం కావడం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

click me!