KL Rahul: టెస్టులు ఆడనివ్వలేదని మామీద ఇలా పగ తీర్చుకుంటున్నావా రాహుల్ భయ్యా.. నీ ఆటకో దండం!

Published : Apr 19, 2023, 10:04 PM ISTUpdated : Apr 19, 2023, 10:06 PM IST
KL Rahul: టెస్టులు ఆడనివ్వలేదని మామీద ఇలా పగ తీర్చుకుంటున్నావా రాహుల్ భయ్యా.. నీ ఆటకో దండం!

సారాంశం

IPL 2023: టీమిండియా వెటరన్ బ్యాటర్, ఐపీఎల్ లో లక్నో  సూపర్ జెయింట్స్ సారథి  కేఎల్ రాహుల్  టీ20లను  టెస్టుల కంటే దారుణంగా ఆడుతున్నాడు.  

బెన్ స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్టులు ఆడే విధానాన్ని మర్చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు ఆడే విధానానికి ‘బజ్‌బాల్’ అని పేరు  పెట్టుకుని  అభిమానులు బోర్ గా ఫీలయ్యే టెస్టులను కూడా రసవత్తరంగా  మార్చుతున్న  జట్టు అది.  కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఆడుతున్నాడు. టీ20లను  టెస్టుల కంటే దారుణంగా ఆడుతున్నాడు. ‘వన్ బాల్ వన్ రన్’తో పాటు కొన్నిసార్లు  ‘వన్ ఓవర్ నో రన్’ అన్నంత పేలవంగా  ఉంది రాహుల్ ఆట.  ఐపీఎల్ - 16లో అతడి ఆటతీరు ‘పరమ బోరింగ్’కే బోర్ తెప్పిస్తున్నది.   రాహుల్ స్ట్రైక్ రేట్  అయితే   రాను రానూ పడిపోతున్నది.

నెల రోజుల క్రితం భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  టెస్టులు ఆడమంటే  అక్కడ చేతులెత్తేసిన రాహుల్.. ఐపీఎల్ లో మాత్రం  తనలోని టెస్టు ఆటగాడిని బయటకు తీస్తున్నాడు. ఈ సీజన్ లో రాహుల్  ఆట  టెస్టుల కంటే దారుణంగా ఉందనడంలో  సందేహమే లేదు. గణాంకాలే అందుకు సాక్ష్యం. 

స్ట్రైక్ రేట్  దారుణం.. 

ఒక మ్యాచ్‌లో   బ్యాటింగ్ చేసే ఏ జట్టుకైనా ఫస్ట్  పవర్ ప్లే (తొలి 6 ఓవర్లు) కీలకం.  పవర్ ప్లేలో వీరబాదుడు బాదితే తర్వాత ఔటైనా  ఆపై వచ్చే బ్యాటర్లు భారీ స్కోర్లు చేసేందుకు వీలుచిక్కుతుంది. కానీ రాహుల్ మాత్రం దానిని సమూలంగా మార్చాడు. ఢిల్లీతో మ్యాచ్ లో  12 బంతులు ఆడిన   అతడు  8  పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ 66.67 గా ఉంది. చెన్నైతో మ్యాచ్ లో  18 బంతుల్లో 20 పరుగులు (స్ట్రైక్ రేట్ 111. 11), సన్ రైజర్స్ హైదరాబాద్  తో 31 బంతుల్లో 35 రన్స్ (స్ట్రైక్ రేట్ 112.90),   ఆర్సీబీతో  20 బంతుల్లో  18 రన్స్ (స్ట్రైక్ రేట్ 90), పంజాబ్ తో 56 బంతుల్లో  74 పరుగులు చేసినా స్ట్రైక్ రేట్ 132.14 మాత్రమే. 

ఇక తాజాగా రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 32 బంతులాడి 39 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 121 గా నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి  194 పరుగులు చేసిన రాహుల్ స్ట్రైక్ రేట్ 114. 79 మాత్రమే. ఐపీఎల్-16లో ఇప్పటివరకు  అత్యధిక పరుగులు సాధించిన టాప్ -15 బ్యాటర్లలో 11 వ స్థానంలో ఉన్న రాహుల్ స్ట్రైక్ రేట్ మాత్రమే అందరికంటే తక్కువగా (114.79)  నమోదైంది. ఇవన్నీ చూశాక  అసలు ఐపీఎల్ లో రాహుల్  14 బంతుల్లో హాఫ్ సెంచరీ  ఎలా చేశాడన్నది  ఇప్పటికీ  ఆశ్చర్యంగానే ఉందంటున్నారు  ఐపీఎల్ ఫ్యాన్స్.  

 

 

ఇంత బోరింగ్ ఆట నేనెప్పుడూ చూడలే : పీటర్సన్

మామూలుగానే రాహుల్ ట్రోలర్స్ కు  సరుకు వంటివాడు. అతడు ఆడినా, ఆడకున్నా అతడొక మీమ్స్ కింగే. ఇక తాజాగా అతడి  ఆటపై  కూడా ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారు.  ‘టెస్టుల నుంచి తప్పించారని కోపంతో ఇలా ఆడుతున్నావా..?’, ‘మేమేం పాపం చేశాం. మాకెందుకీ శిక్ష’, అంటూ ఆటాడుకుంటున్నారు.  ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అయితే రాజస్తాన్ తో మ్యాచ్ జరుగుతుండగా కామెంట్రీ బాక్స్ లో .. ‘పవర్ ప్లే లో రాహుల్ బ్యాటింగ్ చూస్తే  పరమ బోరింగ్ గా ఉంది. నేనైతే ఇంత చెత్త ఎప్పుడూ చూడలేదు’ అని  బహిరంగంగానే  వాపోయాడు. 

 

అదిదా రాహుల్...

మరి ఇంగ్లాండ్ వారి దూకుడుకు ‘బజ్‌బాల్’ అని పేరు పెట్టుకుంటే కేఎల్ తన ఆటకు ఏం పేరు పెట్టుకుంటాడో..? అని  ఫ్రస్ట్రేటెడ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వాపోతున్నారు.  మరో ముఖ్య విషయం.. 2014 నుంచి ఐపీఎల్ లో 27 ఫస్ట్ ఓవర్లు మెయిడిన్ అయితే  అందులో రాహుల్ ఆడనవి 11 (రాజస్తాన్ తో మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్ ఓవర్ తో కలుపుకుని) ఉన్నాయి.  అదిదా  రాహుల్...

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !