ఆయన తర్వాత కేకేఆర్‌కు నేనే సెంచరీ కొడతా.. చెప్పి మరీ బాదిన వెంకటేశ్ అయ్యర్

By Srinivas MFirst Published Apr 19, 2023, 8:39 PM IST
Highlights

IPL 2023: ఐపీఎల్ - 16లో రెండో సెంచరీ నమోదు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్  వెంకటేశ్ అయ్యర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్ - 16లో  హ్యారీ బ్రూక్ తర్వాత రెండో సెంచరీ నమోదుచేశాడు కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్. ఇటీవలే వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో  51  బంతుల్లో 6 ఫోర్లు 9 సిక్సర్ల సాయంతో 104  పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అయ్యర్ సెంచరీ చేసినా కేకేఆర్ గెలవలేదు.  అయితే ఈ  మ్యాచ్ లో  సెంచరీ గురించి తాజాగా అయ్యర్   ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  కేకేఆర్  కు ఫస్ట్ సెంచరీ చేసిన బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత తానే సెంచరీ చేస్తానని అతడికే చెప్పి మరీ  చేసి చూపెట్టినట్టు  తెలిపాడు. 

ముంబై తో మ్యాచ్ ముగిసిన తర్వాత  కేకేఆర్ విడుదల చేసిన వీడియోలో   అయ్యర్ మాట్లాడుతూ..  ‘నేను 2020లో కేకేఆర్ క్యాంప్ కు వెళ్లినప్పుడు  నాటి కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్  నన్ను పిలిచాడు.  అప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ నాకు ఇప్పటికీ గుర్తుంది. 

మెక్‌కల్లమ్ నాతో.. ‘నీ గోల్ ఏంటి...?’ అని అడిగాడు.  అప్పుడు నేను  కేకేఆర్ తరఫున మీ తర్వాత   నేను సెంచరీ చేస్తా. అదే నా గోల్ అని చెప్పాను. అది విన్నాక ఆయన ఒక్కటి కాదు రెండు చేయాలని నాతో చెప్పాడు.  కానీ  గత రెండు సీజన్లలో నేను ఆ ఫీట్ చేరుకోలేకపోయాను.  ఈ ఏడాది సాధించినందుకు సంతోషంగా ఉంది. అయితే మేం మ్యాచ్ గెలిచుంటే ఇంకా బాగుండేది..’ అని అన్నాడు.  

 

కాగా ఐపీఎల్ లో  ఫస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో  కేకేఆర్ ఓపెనర్ గా వచ్చి వీరవిహారం చేసిన మెక్‌కల్లమ్ 158 పరుగులు చేసిన తర్వాత 15 ఏండ్లలో కేకేఆర్ తరఫున ఏ ఒక్క ఆటగాడు కూడా  మూడంకెల స్కోరు చేయలేదు.  ఆ ఘనత సాధించిన రెండో బ్యాటర్   వెంకటేశే కావడం గమనార్హం. 

ఇదే వీడియోలో వెంకటేశ్.. గత ఏడాది తన కాలికి గాయమైనప్పుడు  తాను తిరిగి ఫీల్డ్ లోకి రావడం.. మళ్లీ మునపటి ఫామ్ ను అందుకోవడం  గురించి  కూడా మాట్లాడాడు. ఇదిలాఉండగా  ముంబైతో మ్యాచ్ లో ఓడిన కేకేఆర్.. రేపు ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో  జరుగబోయే మ్యాచ్ లో  తలపడనుంది.   ఐపీఎల్ - 16 లో ఆడిన  ఐదు మ్యాచ్ లలో  రెండు మాత్రమే గెలిచిన  కేకేఆర్.. పాయింట్ల పట్టికలో  ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ ఇంకా ఖాతా తెరవలేదు.  

 

click me!