
వచ్చే ఐపీఎల్ సీజన్ (IPL-2022) లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త జట్లు (New Ipl teams) ఏమై ఉంటాయా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలను చేజిక్కించుకోవడానికి భారత్ లోని బడా కార్పొరేట్ సంస్థలే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ క్లబ్ గా పేరున్న మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United) కూడా బిడ్ దాఖలు చేసినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కొత్త ఐపీఎల్ జట్ల టెండర్లను ఎంచుకునే గడువు బుధవారంతోనే ముగిసింది. ఈనెల 25న.. అంటే 24న జరిగే హైఓల్టేజీ ఇండియా-పాకిస్తాన్ (India vs pakistan) మ్యాచ్ అనంతరం బీసీసీఐ కొత్త జట్ల పేర్లు, వివరాలు ప్రకటించనుంది. అయితే కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఓనర్స్ గ్లేజర్ ఫ్యామిలీ (glazer family)తో పాటు మాజీ ఫార్ములా 1 భాగస్వాములు గా ఉన్న సీవీసీ పార్ట్నర్స్ (CVC Partners).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ (Jindal steel and power) లు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీవీసీ పార్ట్నర్స్.. లా లిగా (La liga) (ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫుట్ బాల్ లీగ్) లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. స్పానిష్ లీగ్ లో కూడా 10.95 శాతం వాటాను కొనుగోలు చేసింది. అంతేగాక ప్రీమిమర్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి : T20 World Cup 2021: అంతా భారత్ కే అనుకూలంగా ఉంది.. కోహ్లితో జాగ్రత్త.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
T20 Worldcup 2021: జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక.. థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్
ఇక మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ క్లబ్ గా ఆ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. గ్లేజర్ ఫ్యామిలీ చేతుల్లో ఉన్న మాంచెస్టర్ యునైటెడ్.. ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ వేసినట్టు సమాచారం.
మాంచెస్టర్ యునైటెడ్, సీవీసీ పార్ట్నర్స్ తో పాటు భారత్ లోని బిగ్ కార్పొరేట్ కంపెనీలు కూడా కొత్త ఫ్రాంచైజీల మీద కన్నేసినట్టు తెలుస్తున్నది. బిడ్ దాఖలు చేసిన సంస్థల జాబితాలో.. సంజీవ్ గొయెంకా (ఆర్పీఎస్జీ), అదానీ గ్రూప్ ప్రమోటర్స్, నవీన్ జిందాల్ (జిందాల్ పవర్ అండ్ స్టీల్), టోరెంట్ ఫార్మా, రొని స్క్రూవాల, అరబిందో ఫార్మా, కొటక్ గ్రూప్, పీఈ ఫర్మ్ (సింగపూర్), హిందూస్థాన్ టైమ్స్ మీడియా, ఐటీడబ్ల్యూ (బ్రాడ్కాస్ట్ అండ్ స్పోర్ట్స్ కన్సల్టింగ్ ఏజెన్సీ), గ్రూప్ ఎం కూడా ఉన్నాయి.
ఐపీఎల్ టెండర్ ప్రకారం.. కొత్త జట్టు వేలంలో పాల్గొనాలంటే కనీసం 300 మిలియన్ డాలర్ల (రూ. 2,188 కోట్లు) బడ్జెట్ కలిగి ఉండాలి. ఇందులో ప్రాథమిక ధరతో పాటు ప్రారంభ రుసుమూ ఉంటుంది. రూ. 10 లక్షలు చెల్లించి ఏ సంస్థ అయినా బిడ్ పత్రాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త జట్ల కనీస ధర రూ. 2 వేల కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. దీంతో బీసీసీఐకి రూ. 5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.