IPL: ఐపీఎల్ మాస్టర్ మైండ్ లలిత్ మోడీపై బయోపిక్.. ప్రకటించిన 83 నిర్మాత

Published : Apr 18, 2022, 04:03 PM ISTUpdated : Apr 18, 2022, 04:05 PM IST
IPL: ఐపీఎల్ మాస్టర్ మైండ్ లలిత్ మోడీపై బయోపిక్..  ప్రకటించిన 83 నిర్మాత

సారాంశం

Biopic On Lalit Modi: ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర  పోషిస్తున్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనడంలో అతిశయోక్తేమీ లేదు. అలాంటి ఐపీఎల్  సృష్టికర్తపై బయోపిక్ రాబోతున్నది. 

భారత క్రికెట్ కు 15 ఏండ్లుగా బంగారు బాతుగుడ్డులా దొరికిన ఐపీఎల్ ను అందించిన మాస్టర్ మైండ్ లలిత్ మోడీపై బయోపిక్ రానున్నది. ఇటీవలే బాలీవుడ్ లో కపిల్ దేవ్  1983 వన్డే ప్రపంచకప్ విజయగాథను ఎంతో హృద్యంగా చూపించిన నిర్మాతలు  ఈ చిత్రాన్ని  నిర్మించబోతున్నారు.  ఈ మేరకు 83 నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.  83 కంటే ముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి  జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాను కూడా నిర్మించారు విష్ణువర్ధన్ ఇందూరి.

ప్రముఖ క్రికెట్ జర్నలిస్టు బొరియా మజుందార్ రాసిన ‘Maverick Commissioner - Lalit Modi, IPL saga’ అనే  పుస్తకం ఆధారంగా  ఈ చిత్రం తెరకెక్కనుంది.  కాగా ఈ పుస్తకం భారత్ లో మే 20న విడుదల కానున్నది.  

కాగా భారత క్రికెట్  ను కొత్త పుంతలు తొక్కించిన వారిలో లలిత్ మోడీ పేరు తప్పకఉంటుంది.  ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ క్రీడను గల్లీ గల్లీకి తీసుకొచ్చింది ఐపీఎల్. ఈ లీగ్ వల్ల భారత  క్రికెట్ ముఖచిత్రమే మారిపోయింది.  దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆటగాళ్లు ఎందరో  ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. 8 ఫ్రాంచైజీలతో 2008లో ఈ లీగ్  అప్పటి చైర్మన్, కమిషనర్ లలిత్ మోడీ సారథ్యంలో ఐపీఎల్ రూపుదిద్దుకుంది.  అతడి జీవిత విశేషాలు, భారత క్రికెట్  పై ఐపీఎల్ ప్రభావం తదితర అంశాలన్నీ మజుందార్ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. 

ఇక ఇదే విషయమై విష్ణు వర్ధన్  ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..  ‘83 ప్రపంచకప్  గెలవడం  అనేది మంచుకొండలో ఒక చిన్న ముక్క వంటిది. స్పోర్ట్స్ జర్నలిస్టు మజుందార్ రాసిన ‘మావెరిక్ కమిషనర్’ పుస్తకం  ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీలోని చాలా పార్శ్వాలను ఆవిష్కరిస్తున్నది. మేము ఈ  పుస్తకాన్ని  చిత్రంగా తీయబోతున్నాము..’ అని తెలిపారు. 

 

భారతీయ ప్రజల జీవితాల్లో ఐపీఎల్ తీసుకొచ్చిన మార్పును ఈ పుస్తకంలో క్లుప్తంగా చర్చించారని  విష్ణువర్ధన్ అన్నారు.   ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ కార్నివాల్ లో ఒకటిగా ఐపీఎల్ ఎలా రూపాంతరం చెందింది..?  అనే విషయాలు ఇందులో దాగి ఉన్నాయని చెప్పారు. దేశంలో ఐపీఎల్ అనేది ఒక క్రీడ మాత్రమే కాదని అంతకు మించి అని ఈ పుస్తకం తెలియజేస్తుందని వివరించారు.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే తెలుస్తాయని  ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !