
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో స్కాట్లాండ్‌పై భారత అద్భుత ఆటతీరును ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకముందే క్రికెట్ ప్రపంచంలో విషాదం జరిగింది. లెజెండరీ క్రికెటర్ కోచ్ తారక్ సిన్హా, 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తారక్ సిన్హా, ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ప్రాణాలు విడిచారు.
ఢిల్లీలో సొన్నెట్ క్లబ్‌ను స్థాపించిన తారక్ సిన్హా, ఢిల్లీ క్రికెట్ జట్టుకి ఎంతోమంది సత్తా ఉన్న ఆటగాళ్లను అందించారు. తారక్ సిన్హా సొన్నెట్ క్లబ్‌లో శిక్షణ పొందితే చాలు, ఢిల్లీ టీమ్‌కి అటు నుంచి టీమిండియాకి వెళ్లవచ్చని అక్కడ జనాలు బలంగా ఫిక్స్ అయిపోతారు. తారక్ సిన్హా కోచింగ్‌లో రాటుతేలిన దాదాపు డజను మంది ప్లేయర్లు, భారత జట్టు తరుపున ఆడడం విశేషం.
రాధీర్ సింగ్, సురేందర్ ఖన్నా, రమణ్ లంబా, మనోజ్ ప్రభాకర్, అతుల్ వస్సన్, అజయ్ శర్మ, కె. పీ. భాస్కర్, సంజీవ్ శర్మ, ఆశీష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ వంటి టీమిండియా పురుష క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా కూడా తారక్ సిన్హా కోచింగ్‌లో రాటుతేలిన వాళ్లే కావడం విశేషం..
Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...
తారక్ సిన్హా మరణంపై సొన్నెట్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘సొన్నెట్ క్లబ్‌ని స్థాపించిన శ్రీ తారక సిన్హాగారు మన మధ్య లేరనే విషయాన్ని తెలియచేయడానికి చింతిస్తున్నాం. రెండు నెలలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు... ’ అంటూ తెలిపింది సొన్నెట్ క్లబ్...
2018లో ఢిల్లీ జట్టుకి అందించిన సేవలకు గానూ ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్నారు తారక్ సిన్హా. భారత క్రికెట్ కోచ్ చరిత్రలో దేశ్ ప్రేమ్ అజాద్, గురుచరణ్ సింగ్, రమకాంత్ అచేకర్, సునీత్ శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న క్రికెట్ కోచ్‌గా రికార్డు క్రియేట్ చేశారు తారక్ సిన్హా...
తారక్ సిన్హా దగ్గర శిక్షణ తీసుకున్న భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి ఘటించింది. ‘ది కోచ్, మిస్టర్ తారక్ సిన్హా. సొన్నెట్ క్రికెట్ క్లబ్ భారత జట్టుకి, మహిళా, పురుషుల దేశవాళీ జట్లకు ఎందరో క్రికెటర్లను అందించిన నర్సరీ... ఆయన కోచ్ మాత్రమే కాదు, ఓ మంచి గైడ్, మెంటర్... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా సార్’ అంటూ ట్వీట్ చేసింది అంజుమ్ చోప్రా...
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా తారక్ సిన్హా మరణంపై స్పందించాడు. ‘ఉస్తాద్ జీ ఇక లేరు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత. దాదాపు డజన్ మంది భారత క్రికెటర్లకు కోచ్. ఎందరో పురుషుల, మహిళల ఫస్ట్ క్లాస్ క్రికెటర్లను తయారుచేసిన కోచ్. ఏ సంస్థ సాయం లేకుండా ఆయన క్రికెట్ క్లబ్‌ని నడిపారు. భారత క్రికెట్ మీ సేవలను ఎప్పటికీ మరవదు సర్... ఓం శాంతి..’ అంటూ ట్వీట్ చేశారు ఆకాశ్ చోప్రా..