కలిస్ కు షాక్... మెక్‌కల్లమ్ కోసం కేకేఆర్ సంచలన నిర్ణయం

By Arun Kumar PFirst Published Aug 16, 2019, 7:26 PM IST
Highlights

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన జాక్వస్ కలిస్ ను తొలగించి అతడి స్థానంలో మరో మాజీ స్టార్ క్రికెటర్ ను నియమించింది.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తమ జట్టును మరింత మెరుగ్గా  తీర్చిదిద్దేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ చర్యలు ప్రారంభించింది. అందుకోసం మొట్టమొదట చీఫ్ కోచ్ జాక్వస్ కలిస్ పై వేటు వేసింది. గత సీజస్ లో కేకేఆర్ ఆటతీరు ఆ జట్టు యాజమాన్యాన్ని అసంతృప్తికి గురిచేసింది. అంతేకాకుండా రస్సెల్ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే తమ జట్టు ప్రదర్శన చెత్తగా వుందంటూ కామెంట్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని జట్టు ప్రక్షాళనకు పూనుకున్న కేకేఆర్ యాజమాన్యం కలిస్ పై మొదటి వేటు వేసింది. 

అతడి స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ను నియమించింది. అంటే వచ్చే సీజన్లో కేకేఆర్ ఆటగాళ్లు మెక్ కల్లమ్ పర్యవేక్షణలో ఆడనున్నారన్నమాట. గతంలో ఇదే కోల్ కతా జట్టులో ప్రాతినిధ్యం వహించిన మెక్ కల్లమ్ ఆ జట్టుకే చీఫ్  కోచ్ గా మారడం విశేషం. కేవలం కేకేఆర్ జట్టుకే కాకుండా అదే ఫ్రాంచైజీకి చెందిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో ఆడే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు కూడా మెకల్లమ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 

ఐపిఎల్ 2019 లో కేకేఆర్ చెత్త ఆటతీరుతో కనీసం ప్లేఆఫ్ కు కూడా చేరలేకపోయింది. రస్సెల్స్, కెప్టెన్ కార్తిక్ వంటి ఆటగాళ్లు కొన్ని మ్యాచుల్లో మెరిసినా జట్టు సమిష్టిగా రాణించలేకపోయింది. దీంతో ఈ లీగ్  కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్ కార్తిక్ ఆటగాళ్ళను మీడియా సమక్షంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే రస్సెల్స్ కూడా తమ జట్టు ఆటతీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో  పెట్టుకుని కేకేఆర్ యాజమాన్యం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  

ఐపిఎల్ కెరీర్ ను కోల్ కతా  నైట్ రైడర్స్ తరపున ప్రారంభించిన మెక్ కల్లమ్ ఆరంభ మ్యాచ్ లోనే సెంచరీతో అదరగొట్టాడు. అతడు కేవలం 73  బంతుల్లోనే 13  సిక్సర్లు 10 ఫోర్ల  సాయంతో 158 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత పలు సీజన్లలో కెకెఆర్ తరపునే ఆడిన అతడు కొచ్చి టస్కస్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్,  రాయల్ చాలెంజర్ బెంగళూరు తరపున కూడా ఆడాడు.  
 

click me!