టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ ఆత్మహత్య... కారణాలివే...?

By Arun Kumar PFirst Published Aug 16, 2019, 5:38 PM IST
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ విబి చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్వగృహంలో గురువారం రాత్రి అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. 

భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్షన్ కమిటీ మెంబర్ విబి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు.  దీంతో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లుగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెరపడింది. గురువారం రాత్రి అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 

చెన్నైలోని మైలాపూర్‌ కాలనీలో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత తన రూంలోకి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. తన రూంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మృతిచెందిన తర్వాత చాలాసేపటికి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని గమనించి తమకు సమాచారం అందించినట్లుగా ప్రాథమిక విచారణలో  తేలిందని పోలీసులు వెల్లడించారు. 

చంద్రశేఖర్ ఆత్మహత్య కు ఆర్థిక ఇబ్బందులే కారణమై వుంటాయని తాము అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అతడు ''విబి వీరన్స్'' జట్టుకు యజమాని. దానితో పాటు చెన్నైలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్రికెట్ అనే పేరుతో ఓ అకాడమీని ప్రారంభించారు.  

ఇలా లీగ్ లో జట్టు కొనుగోలు, మెయింటెనెన్స్ తో పాటు అకాడమీ కోసం బయటి నుండి భారీమొత్తంలో డబ్బులు తెచ్చి ఖర్చు చేశాడు. అయితే పెట్టుబడికి తగ్గ లాభాలు రాకపోవడంతో అతడు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వాటిని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

వక్కడయి బిక్షేశ్వరన్ చంద్రశేఖర్ కు తమిళనాడు రంజీ క్రికెటర్ గా అద్భుతమైన ట్రాక్ రికార్డుంది. కానీ అంతర్జాతీయ క్రికెటర్ గా రాణించలేకపోయాడు. టీమిండియా తరపున అతడు కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడి 53 పరుగులు చేశాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కొంతకాలం అతడు సెలెక్టర్ గా బిసిసిఐకి సేవలందించాడు. 

మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ మృతికి బిసిసిఐ సంతాపం వ్యక్తం ప్రకటించింది. అలాగే మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అతడితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు హర్భజన్‌సింగ్‌, సురేశ్‌రైనా  లతో పాటు మాజీ క్రికెటర్లు అనిల్‌కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆయన మృతికి విచారం వ్యక్తం చేశారు. 

click me!