
వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ -2023 రిటెన్షన్ కు తుది గడువుకు కొద్దిసేపటి ముందే అతడిని ముంబై రిటైన్ చేసుకోవడం లేదని ప్రకటించిన తర్వాత పొలార్డ్ ఈ నిర్ణయానికి వచ్చాడు. తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ఓ భావోద్వేగ నోట్ రాసి పోస్ట్ చేశాడు. ముంబై ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ దిగ్గజ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తిరిగి ముంబై అతడికి మరో కీ రోల్ అప్పగించింది. పొలార్డ్ ను తమ బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంది.
ముంబై పొలార్డ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే పొలార్డ్ ట్విటర్ లో.. ‘నేను మరికొన్నాళ్లు ఆడుతూనే ఉంటాను. కావున ఇదేం అంత సులువైన నిర్ణయమైతే కాదు. ఐపీఎల్ లో ఎన్నో విజయాలు సాధించిన ముంబైకి పరివర్తన అవసరమని నేను భావించాను.. ఒకవేళ నేను ఐపీఎల్ లో కొనసాగాల్సివస్తే తిరిగి ముంబైకి వ్యతిరేకంగా ఆడాలి.. అది నావల్ల కాదు...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీకి నేను ప్రాతినిథ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. ఇదేమీ ముంబైకి ఎమోషనల్ గుడ్ బై కాదు. నేను ఆటగాడిగా నిష్క్రమిస్తున్నా ముంబైతో పాటు ముంబై ఎమిరేట్స్ (యూఏఈ లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ లో ముంబై ఫ్రాంచైజీ)కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తా. ఇది నా క్రికెట్ కెరీర్ లో మరో అధ్యాయం....’అని పొలార్డ్ రాసుకొచ్చాడు.
ముంబైతో పొలార్డ్..
ముంబైతో పొలార్డ్ కు ఉన్నఅనుబంధం ఇప్పటిది కాదు. 2010 నుంచి అతడు ఈ ఫ్రాంచైజీ తరఫునే ఆడుతున్నాడు. ఒక జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), సునీల్ నరైన్ (కేకేఆర్), జస్ప్రీత్ బుమ్రా (ముంబై), లసిత్ మలింగ (ముంబై) ల తర్వాత ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్ లు ఆడినవారిలో పొలార్డ్ కూడా ఒకడు. ముంబై తరఫున పొలార్డ్ ఏకంగా 189 మ్యాచ్ లు ఆడటం గమనార్హం.
2009లో ఛాంపియన్స్ లీగ్ టీ20లో పొలార్డ్ బ్యాటింగ్, ఫీల్డింగ్,బౌలింగ్ విన్యాసాలను గమనించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు 2010వేలంలో అతడి వెంట పడ్డాయి. ఆ వేలంలో ముంబై,చెన్నై, బెంగళూరు,కోల్కతాలు పొలార్డ్ కోసం పోటీపడ్డాయి. కానీ చివరికి పొలార్డ్ ను ముంబై దక్కించుకుంది.
గణాంకాలు ఇవి..
ఐపీఎల్ లో తన విన్యాసాలతో ప్రేక్షకులను అలరించిన పొలార్డ్.. 189 మ్యాచ్ లలో 171 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్థ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 87 గా ఉంది. ఐపీఎల్ లో 218 ఫోర్లు, 223 సిక్సర్లు కొట్టిన పొలార్డ్.. ముంబై ఐదు ట్రోఫీలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక బౌలింగ్ లో పొలార్డ్.. 107 ఇన్నింగ్స్ లలో 248 ఓవర్లు బౌలింగ్ చేసి 69 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4-44గా ఉంది.
2021 సీజన్ లో ఫర్వాలేదనిపించిన పొలార్డ్.. గత సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన పొలార్డ్.. 144 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో 14 ఓవర్లు వేసి 4 వికెట్లు మాత్రమే తీశాడు.
- ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో పొలార్డ్ చాలా కీలకంగా వ్యవహరించాడు.
- ఐపీఎల్ లో 3 వేల పరుగులు, 50 వికెట్లు తీసిన వారిలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తర్వాత పొలార్డ్ మాత్రమే.
- ఐపీఎల్ లో 223 సిక్సర్లు కొట్టిన పొలార్డ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.