Jyothi Yarraji : ఆసియా అథ్లెటిక్స్ 2025లో జ్యోతి యర్రాజీకి గోల్డ్‌ మెడల్‌.. చంద్రబాబు ప్రశంసలు

Published : May 30, 2025, 12:46 AM IST
Jyothi Yarraji

సారాంశం

Jyothi Yarraji: తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ ఆసియా అథ్లెటిక్స్ 2025 (asian athletics championships) లో 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. అలాగే, కొత్త ఛాంపియన్‌షిప్ రికార్డును కూడా నమోదు చేసింది.

Jyothi Yarraji wins gold: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో తెలుగు అథ్లెట్ జ్యోతి యార్రాజీ గోల్డ్ మెడల్ సాధించారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత అథ్లెట్ జ్యోతి యార్రాజీ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో పాటు కొత్త ఛాంపియన్‌షిప్ రికార్డు నెలకొల్పింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్ల టైమింగ్‌తో మొదటి స్థానం దక్కించుకుంది.

జ్యోతి 2023లో జరిగిన బ్యాంకాక్ ఎడిషన్‌లో కూడా స్వర్ణం గెలుచుకుంది, అప్పట్లో ఆమె టైమింగ్ 13.09 సెకన్లు. ఈసారి 12.96 సెకన్లతో ఆమె తన స్వంత రికార్డును తానే బద్దలుకొట్టింది. అయితే, జ్యోతి వ్యక్తిగత బెస్ట్ 12.78సెకన్లు. ఈ విజయంతో జ్యోతి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌ను రీటైన్ చేసిన ఐదవ అథ్లెట్‌గా నిలిచింది. జపాన్‌కు చెందిన ఎమీ ఆకిమొటో (1979, 1981, 1983), చైనా అథ్లెట్లు జాంగ్ యు (1991, 1993), సు యిన్పింగ్ (2003, 2005), సన్ యావీ (2009, 2011)ల సరసన చేరింది.

ఈ రేసులో జపాన్ అథ్లెట్ యుమి తనాకా 13.06 సెకన్లతో సిల్వర్, చైనా అథ్లెట్ వూ యానీ 13.067 సెకన్లతో బ్రాంజ్ గెలుచుకున్నారు. భారత అథ్లెట్ జ్యోతి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మొదట 6:25 PMకి షెడ్యూల్ చేసిన ఈ ఫైనల్ వర్షం కారణంగా రాత్రి 10:25కి వాయిదాపడింది. తక్కువ ప్రదేశంలో వార్మప్ చేయాల్సిన పరిస్థితిలోనూ జ్యోతి మానసికంగా తనను సిద్ధం చేసుకుంది. "ఆ సమయంలో శారీరకంగా సాధ్యం కాకపోయినా, మానసికంగా హర్డిల్స్ ఎలా దాటాలి, స్టార్ట్ ఎలా ఉండాలి అన్నిటినీ పదిసార్లు కంటే ఎక్కువగా విజువలైజ్ చేశాను" అని ఆమె చెప్పింది.

అధిక ఒత్తిడిలోనూ టైమింగ్‌పై దృష్టి పెడుతూ పతకాన్ని కాకుండా లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే విజయం సాధించానని జ్యోతి వెల్లడించింది. ఈ విజయానికి ముందు జ్యోతి మోకాలి గాయం కారణంగా మూడు వారాల పాటు శిక్షణ తీసుకోలేకపోయింది. ఫెడరేషన్ కప్‌కు సన్నద్ధమవ్వడానికి కూడా తగిన సమయం దొరకలేదు. అయినా గుమిలో జరిగిన రేసులో అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని భారత ఖాతాలో వేసింది.

జ్యోతి యర్రాజీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

“భారతదేశపు అత్యంత వేగవంతమైన హర్డిల్స్ రన్నర్,  తెలుగమ్మాయి, మన ముద్దుబిడ్డ అయిన జ్యోతి యార్రాజీకి హృదయపూర్వక అభినందనలు. దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100మీ హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మీ విజయంతో దేశం, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారు. మీ భవిష్యత్తు విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vaibhav Suryavanshi : ధోనీని గుర్తు చేసిన వైభవ్ సూర్యవంశీ హెలికాప్టర్ షాట్
World Cup 2026 Final : అఫ్గాన్ ప్యాక్.. టీమిండియా షేక్ ! 10వ సారి ఫైనల్లో భారత్