Suyash Sharma: పంజాబ్ కొంపముంచాడు.. ఎవరీ సుయాష్ శర్మ?

Published : May 29, 2025, 11:14 PM IST
Suyash Sharma, RCB

సారాంశం

Suyash Sharma: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ నాలుగో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఆర్సీబీ లెగ్‌స్పిన్నర్ సుయాష్ శర్మ ఐపీఎల్ 2025 క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు.

Who Is Suyash Sharma: పంజాబ్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి ఆర్సీబీ ఐపీఎల్ 2025లో ఫైనల్ కు చేరుకుంది. ముల్లన్‌పూర్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)-పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ యంగ్ లెగ్‌స్పిన్నర్ సుయాష్ శర్మ తన అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. అతని బౌలింగ్ దెబ్బతో పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది.

IPL 2025 Qualifier 1 RCB vs PBKS: మూడు కీలక వికెట్లు తీసిన సుయాష్ శర్మ

ఈ మ్యాచ్‌లో సుయాష్ శర్మ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు మిడిలార్డర్‌ను దెబ్బకొట్టాడు. 11వ ఓవర్లో మార్కస్ స్టోయినిస్‌ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేయడం కీలకంగా మారింది. స్టోయినిస్ లెగ్‌సైడ్‌కు భారీ షాట్‌కు ప్రయత్నించగా, సుయాష్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌ను పడగొట్టింది. ఇది సుయాష్‌కు ఈ ఇన్నింగ్స్‌లో మూడో వికెట్.

అంతకుముందు సుయాష్ శర్మ.. మంచి ఫామ్ లో ఉన్న శశాంక్ సింగ్ ను 3 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తూ ఇంపాక్ట్ సబ్ గా వచ్చిన ముషీర్ ఖాన్‌ను పరుగుల ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపించాడు. సుయాష్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆర్సీబీ ఈజీగానే మ్యాచ్ ను గెలుచుకుంది. 

మ్యాచ్ అనంతరం సుయాష్ మాట్లాడుతూ.. "ఇది ఒక సాధారణ మ్యాచ్‌లా భావించాం. నా బౌలింగ్‌ను మరింత మెరుగ్గా మార్చుకోవడానికి శ్రమించాను. ఇవాళ నా గూగ్లీలు ఎవరికీ అర్థం కాలేదు. కోచ్ చెప్పిన ప్రణాళికను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేశాను.. వికెట్లు తీసుకున్నాను" అని తెలిపాడు. ఈ మ్యాచ్ లో సుయాష్ శర్మ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

సుయాష్ శర్మ ఎవరు?

సుయాష్ శర్మ 2003 మే 15న ఢిల్లీ లోని భజన్‌పురాలో జన్మించాడు. అతని అద్భుతమైన క్రికెట్ ప్రదర్శనతో ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడకుండానే ఐపీఎల్‌లో చోటు సంపాదించాడు. 2023లో కోలకతా నైట్‌రైడర్స్ తరఫున 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుయాష్ శర్మ.. ఆర్సీబీపై 3/30 బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

2025 ఐపీఎల్ మెగా వేలంలో రూ.2.60 కోట్లు చెల్లించి ఆర్‌సీబీ సుయాష్ ను కొనుగోలు చేసింది. ఇది అతనికి అత్యధిక ధర పలికిన స్పిన్నర్‌గా గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటివరకు 26 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన సుయాష్, భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు కీలక బౌలర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

సుయాష్ శర్మ ఆదాయం ఎంత?

2025 నాటికి సుయాష్ శర్మ నికర ఆస్తి అంచనా ప్రకారం సుమారు రూ. 7.7 కోట్లు. ఈ ఆదాయం ఎక్కువగా ఐపీఎల్ ఒప్పందాలు, దేశవాళీ క్రికెట్, బ్రాండ్ ప్రమోషన్‌ల ద్వారా వస్తున్నాయి.

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 పంజాబ్ vs బెంగళూరు మ్యాచ్ హైలైట్స్

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలో యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ వరుసగా వికెట్లు తీసి పంజాబ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. అనంతరం సుయాష్ శర్మ తన స్పిన్ మాయాజాలంతో మిగిలిన బ్యాటర్లను దెబ్బకొట్టాడు. అలాగే, జోష్ హేజిల్ వుడ్ 3.1 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. పంజాబ్ టీమ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ భాగస్వామ్యం కేవలం 3 ఓవర్లలోనే 30 పరుగులు చేయగా, ఫైనల్ చేరే దిశగా బలమైన ఆరంభాన్ని అందించారు. స్వల్ప టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలోనే 106/2 పరుగులతో విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచింది. ఫిలిప్ సాల్ట్ 56 పరుగులతో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !