IPL2022 PBKS vs GT: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ... పంజాబ్ కింగ్స్‌ ముందు...

Published : May 03, 2022, 09:23 PM IST
IPL2022 PBKS vs GT: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ... పంజాబ్ కింగ్స్‌ ముందు...

సారాంశం

ఐపీఎల్ 2022: యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అజేయ హాఫ్ సెంచరీ... నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్‌ని దెబ్బ తీసిన కగిసో రబాడా... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి, ఇప్పటికే ఫ్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు పంజాబ్ కింగ్స్ బౌలర్లు. ముఖ్యంగా ఐపీఎల్ 2020 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ కగిసో రబాడా నాలుగు వికెట్లు తీసి, టైటాన్స్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్, 143 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ముందు పెట్టింది. 


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కి ఆశించిన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్ తొలి బంతికి శుబ్‌మన్ గిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 6 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రిషి ధావన్ వేసిన డైరెక్ట్ త్రోకి పెవిలియన్ చేరాల్సి వచ్చింది...

17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, కగిసో రబాడా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కుదురుకోవడానికి సమయం తీసుకోవాలని భావించాడు...

7 బంతులాడి ఒక్క పరుగు చేసిన హార్ధిక్ పాండ్యా, రిషి ధావన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. డేవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా  రాహుల్ తెవాటియా 13 బంతుల్లో 11 పరుగులు చేసి రబాడా బౌలింగ్‌లో సందీప్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

తెవాటియాని అవుట్ చేసిన తర్వాతి బంతికే రషీద్ ఖాన్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు కగిసో రబాడా. ఈ సీజన్‌లో రషీద్ ఖాన్‌కి ఇది మూడో డకౌట్, ఓవరాల్‌గా 12వ డక్. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన విదేశీ ప్లేయర్‌గా గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు రషీద్ ఖాన్...

ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన సాయి సుదర్శన్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో డెత్ ఓవర్లలో సిక్సర్ ఇవ్వని అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాది.. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు సాయి సుదర్శన్...

2 పరుగులు చేసిన ప్రదీప్ సాంగ్వాన్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రబాడా వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన లూకీ ఫర్గూసన్, ఆ తర్వాతి బంతికి లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !