IPL2022 PBKS vs CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఇరుజట్లకీ కీలకంగా...

By Chinthakindhi RamuFirst Published Apr 25, 2022, 7:07 PM IST
Highlights

ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ కింగ్స్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో తలబడుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. లియామ్ లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 33, జితీశ్ శర్మ 26 పరుగులు చేసి రాణించడంతో పంజాబ్ కింగ్స్ 180 పరుగుల భారీ స్కోరు చేసింది...

Latest Videos

లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌ 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్‌ ఫస్టాఫ్‌లో 7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది. మరో వైపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఏ మాత్రం మెరుగ్గా లేదు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 115 పరగులకే ఆలౌట్ అయ్యి 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది పంజాబ్ కింగ్స్. ఆ పరాజయం తర్వాత ఆడుతున్న మ్యాచ్ కావడంతో పంజాబ్ కింగ్స్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు రాబట్టిన ఎమ్మెస్ ధోనీ, చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు...

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అలాగే గాయం కారణంగా ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, కొన్ని మ్యాచులకు దూరంగా ఉండబోతున్నాడు. ఇప్పటికే దీపక్ చాహార్, ఆడమ్ మిల్నే గాయపడి జట్టుకి దూరం కాగా మొయిన్ ఆలీ గాయం... సీఎస్‌కేపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూడాలి...

ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గత మ్యాచ్‌‌లో ముకేశ్ చౌదరి, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచి... దీపక్ చాహార్ లేని లోటు తీర్చేలాగే కనిపించాడు. 

పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా సాధించిన విజయాలన్నింటికీ లియామ్ లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ షో కారణం. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కానీ, ఓపెనర్ శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టోల నుంచి ఆశించిన మెరుపులు రాలేదు. ఆరంభంలో ఆకట్టుకున్న భనుక రాజపక్ష... బెయిర్‌స్టో ఎంట్రీతో చోటు కోల్పోయాడు.

నేటి మ్యాచ్‌లో బెయిర్ స్టో, రాజపక్ష ఇద్దరూ బరిలో దిగబోతున్నారు... అలాగే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న రిషీ ధావన్‌కి ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలిసారి అవకాశం దక్కింది.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, భనుక రాజపక్ష, రిషీ ధావన్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రెటోరియస్, డ్వేన్ బ్రావో, ముకేశ్ చౌదరి, మహీశ తీక్షణ 

click me!