Rohit Sharma: గొప్పోళ్లకే తప్పలేదు.. మనమెంత..! ముంబై వరుస ఓటములపై హిట్ మ్యాన్ ఆసక్తికర ట్వీట్

Published : Apr 25, 2022, 06:57 PM IST
Rohit Sharma: గొప్పోళ్లకే తప్పలేదు.. మనమెంత..! ముంబై వరుస ఓటములపై హిట్ మ్యాన్ ఆసక్తికర ట్వీట్

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్-2022లో  వరుసగా 8 మ్యాచులు ఓడి ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన  ముంబై ఇండియన్స్  ఇక తర్వాత ఆడబోయేవన్నీ నామమాత్రపు మ్యాచులే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఆ జట్టు తాజా వైఫల్యాలపై సారథి రోహిత్ శర్మ స్పందించాడు. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే..  వరుసగా 8  మ్యాచులు ఓడిన రోహిత్ సేన..  ఇకపై ఆడబోయే మ్యాచులన్నీ గెలిచినా ప్లేఆఫ్ చేరడం కష్టం.  ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి రోహిత్ శర్మ  ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. గొప్ప గొప్ప జట్లకు, ఆటగాళ్లకే వాళ్ల కెరీర్ లో ఇలాంటి దశలు తప్పలేదని, దానికి తామేమీ అతీతులం కాదని   రాసుకొచ్చాడు. విజయాలు వచ్చినా రాకున్నా ఈ జట్టు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఐ లవ్ యూ..! అని ట్వీట్ చేశాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్  ముగిసిన తర్వాత ట్విట్టర్ వేదికగా  రోహిత్ శర్మ స్పందిస్తూ..‘ఈ టోర్నమెంట్ లో ఈసారి మేం అనుకున్న మేర రాణించలేకపోయాం. అయితే చాలా మంది క్రికెట్ దిగ్గజాలు కూడా వాళ్ల కెరీర్ లో ఇలాంటి దశ ఎదుర్కున్నారు. కానీ ఈ జట్టు (ముంబై ఇండియన్స్) అంటే నాకు చాలా ఇష్టం.

ఇక్కడి ఆటగాళ్లన్నా వాతావరణం అన్నా నాకు ఎంతో ప్రత్యేకం. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరికీ కృతజ్ఞతలు.  అలాగే మామీద నమ్మకముంచిన  అభిమానులకు, శ్రేయోభిలాషులకు కూడా ధన్యవాదాలు..’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. రోహిత్ చేసిన ఈ ట్వీట్ ను  ముంబై ఇండియన్స్ జట్టు ‘స్ట్రాంగ్ టుగెదర్’ అని రాస్తూ రీట్వీట్ చేసింది.  ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

 

నాలుగు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  ఉత్కంఠ పోరులో  ఓడిన  ముంబై.. తాజాగా లక్నోతో కూడా పరాజయం పాలైంది.  లక్నో తో మ్యాచ్ ను సొంత గడ్డ (వాంఖెడే) పైనే ఆడినా  ముంబై మాత్రం ఆటతీరు మార్చుకోలేదు.  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే  చేసింది. అయితే మోస్తారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు.  సెంచరీతో  కదం తొక్కిన లక్నో సారథి కెఎల్ రాహుల్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ఐపీఎల్ లో ముంబై ప్రదర్శన, వరుస ఓటముల సంగతి పక్కనబెడితే ఆటగాడిగా కూడా రోహిత్ దారుణంగా విఫలమవుతుండటమే  టీమిండియా అభిమానులకు జీర్ణించుకోకుండా ఉన్నది. ఇప్పటివరకు 8   మ్యాచులాడిన రోహిత్.. 19 సగటుతో కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.  ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. వీళ్లతో పాటు  ఆ జట్టు  స్టార్  పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా  8 మ్యాచులాడి 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. వీళ్ల ముగ్గురి ఫామ్  టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్నది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !