IPL2022 MI vs KKR: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... ఓడితే కేకేఆర్ కథ అస్సామే...

By Chinthakindhi RamuFirst Published May 9, 2022, 7:05 PM IST
Highlights

ఐపీఎల్ 2022 సీజన్‌‌లో దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, లేటుగా ఫామ్‌లోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ రేసులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది

2021 సీజన్ రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. 2022 సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా తిలక్ వర్మ మెరుపులు మెరిపించినా 161 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఈ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో ఛేదించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్..

సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై విజయం సాధిస్తే... కేకేఆర్‌ను కూడా పోటీ నుంచి తప్పిస్తుంది. 11 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. 

ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. 7 విజయాలు అందుకుంటే నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది కేకేఆర్...

ఈ సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ ఆరంభ మ్యాచుల్లో ఆకట్టుకున్నా, ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచినా... లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...

ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని, ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలవకుండా ఉండాలంటే ప్రతీ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. దీంతో ముంబై ఇండియన్స్‌కి ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ పరువు సమస్యగా మారగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి చావోరేవోగా మారాయి...

సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రమన్‌దీప్ సింగ్‌కి తుదిజట్టులో అవకాశం దక్కింది. కీలక మ్యాచ్‌లో ఐదు మార్పులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 

గత మ్యాచుల్లో జట్టుకి దూరమైన అజింకా రహానే, ప్యాట్ కమ్మిన్స్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్‌లకు తుదిజట్టులో చోటు దక్కింది. 

ముంబై ఇండియన్స్ జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్, కిరన్ పోలార్డ్, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తీకేయ, జస్ప్రిత్ బుమ్రా, రిలే మెడరిత్ 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: అజింకా రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి

 

click me!