విరాట్ కు విశ్రాంతి..? దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లకు డౌటే.. కోహ్లితోనే తేల్చుకోనున్న సెలెక్టర్లు..!

By Srinivas MFirst Published May 9, 2022, 6:39 PM IST
Highlights

Virat Kohli To Be Rested For SA T20I Series: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి శ్రేయోభిలాషులు, దిగ్గజ క్రికెటర్లు  సూచించిన విధంగానే  జాతీయ సెలెక్షన్ కమిటీ అతడికి విశ్రాంతినివ్వనుందా..? త్వరలో జరుగబోయే రెండు సిరీస్ లకు కోహ్లిని దూరం పెట్టనున్నారా..? 

గత కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి త్వరలో జరుగబోయే రెండు కీలక సిరీస్ లకు ఎంపికవడం అనుమానంగానే ఉంది. ఐపీఎల్-15లో అత్యంత చెత్త ఆటతీరుతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లిని త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే ఐదు టీ20ల సిరీస్, ఐర్లాండ్ టూర్ లకు సెలెక్టర్లు అతడిని దూరం పెట్టనున్నారా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  తీరిక లేని క్రికెట్ ఆడుతుండటం వల్ల కోహ్లి అలిసిపోయాడని.. అతడు కొన్నాళ్లు క్రికెట్ నుంచి దూరంగా ఉంటే మంచిదని  విరాట్ శ్రేయోభిలాషులు  కోరుకుంటున్నట్టే అతడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తున్నది. ఇదే విషయమై ఛేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులు త్వరలోనే కోహ్లితో కీలక భేటీ జరుపనున్నారు. 

ఐపీఎల్-15లో 12 మ్యాచులు ఆడి 19.64 సగటుతో కేవలం 216 పరుగులే చేసిన కోహ్లి.. ఈ సీజన్ లో మూడు గోల్డెన్ డకౌట్లు అయ్యాడు.  ఈ నేపథ్యంలో  రవిశాస్త్రి, మైఖేల్ వాన్ వంటి దిగ్గజాలు అతడు విరామం తీసుకోవాలని  సూచించారు. ఆ సూచనలను కోహ్లి ఎలా తీసుకున్నాడో గానీ సెలెక్టర్లు మాత్రం  వారి సలహాలను  తూచా తప్పకుండా పాటించబోతున్నట్టు తెలుస్తున్నది. 

ఇదే విషయమై  సెలెక్షన్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ...‘ఇలాంటి ఒక దశ ప్రతి ఆటగాడి కెరీర్ లోనూ ఉంటుంది. కోహ్లి ప్రస్తుతం అదే దశలో ఉన్నాడు. అయితే త్వరలోనే అతడు దీనిని అధిగమిస్తాడనే నమ్మకం మాకుంది. కానీ సెలెక్టర్లుగా మా దృష్టి జట్టు మీద ఉంటుంది. మా మొదటి ప్రాధాన్యం కూడా అదే. దక్షిణాఫ్రికా తో సిరీస్ కు ముందు కోహ్లితో మాట్లాడతాం. ఒకవేళ అతడేమైనా విశ్రాంతి కావాలనుకుంటున్నాడా..? లేక పోరాడతాడా..? అనేది అడిగి తెలుసుకుంటాం...’ అని తెలిపాడు. 

ఐపీఎల్ లో కోహ్లి స్కోర్లు ఇలా : 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 9, 58, 30, 0 (మొత్తం 216) గా ఉన్నాయి. అయితే ఐపీఎల్ ప్రదర్శన అనేది జాతీయ జట్టుకు అన్నిసార్లు కొలమానం కానప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో కూడా కోహ్లి గొప్పగా రాణించింది లేదు. అతడు  సెంచరీ చేయక  100 (మూడు ఫార్మాట్లలో) ఇన్నింగ్స్ లు దాటాయి.  

 

What a gesture by Sanjay Bangar after Kohli's dismissal. pic.twitter.com/PHdGEbI0Pj

— Avneet ⍟ (@Avneet_Shilpa)

రహానే, పుజారాల స్ట్రాటజీనే కోహ్లికి.. 

కోహ్లి ఫామ్, జట్టు ప్రయోజనాలు, ఇతర  అంశాలను పరిగణనలోకి తీసుకుంటే   అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమన్న వాదనలు కూడా సెలెక్షన్ కమిటీలో వినిపిస్తున్నాయి.  అదీగాక మునపటి లాగా తాను ఆడకపోయినా జట్టులో స్థానం  సుస్థిరం అన్న ఆప్షన్ కూడా కోహ్లికి ఇప్పుడు లేదు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి.. టీమిండియాలో ఇప్పుడు ఒక సాధారణ  ఆటగాడు మాత్రమే. మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త సీనియర్ అంతే. ఇదే స్ట్రాటజీని సెలెక్టర్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా మీద ప్రయోగించారు. వైస్ కెప్టెన్సీ ఉన్నన్నాళ్లు రహానే ఎలా ఆడినా అతడిని ముట్టుకోలేదు. కానీ అది తొలగించిన తర్వాత మ్యాచ్ లోనే రహానేకు మొండిచేయి చూపారు. రహానే అంత  కఠినంగా కోహ్లి మీద వ్యవహరించకపోయినా అతడి మీద కూడా కత్తి వేలాడుతూనే ఉంది. 

కెప్టెన్, కోచ్ తో కూడా మాట్లాడి.. 

జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఐపీఎల్ ముగిసేనాటికి జట్టును ప్రకటించే అవకాశముంది. ఆలోపే కోహ్లితో మాట్లాడి.. సౌతాఫ్రికా తో పాటు ఐర్లాండ్ సిరీస్ లకు అతడిని దూరంగా పెట్టే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారని సమాచారం.  కోహ్లితో మాట్లాడిన తర్వాత సెలెక్షన్ కమిటీ సభ్యులు..  టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో కూడా చర్చించనున్నారు.  ఆ తర్వాత కోహ్లి విషయంలో ఓ స్పష్టత రానుంది. 

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ : 

- తొలి టీ20 : జూన్ 9 : ఢిల్లీ 
- రెండో టీ20 : జూన్ 12 : కటక్
- మూడో టీ20 : జూన్ 14 : వైజాగ్ 
- నాలుగో టీ20 : జూన్ 17 : రాజ్కోట్ 
- ఐదో టీ20 : జూన్ 19 : బెంగళూరు  

click me!