
పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు దానిష్ కనేరియా-షాహిద్ అఫ్రిది ల మధ్య మొదలైన వివాదం మరింత ముదిరింది. అఫ్రిదికి క్యారెక్టర్ లేదని అతడు అబద్దాల కోరు అని కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి అఫ్రిది కూడా ధీటుగానే బదులిచ్చాడు. తాను అంత చెడ్డవాన్ని అయితే జట్టులో ఉన్నప్పుడే ఎందుకు చెప్పలేదని అఫ్రిది వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ శత్రుదేశం (భారత్) తో అతడు (కనేరియా) చేతులు కలిపాడని, ఆ దేశ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని అఫ్రిది చేసిన ఆరోపణలపై తాజాగా కనేరియా కూడా స్పందించాడు. భారత్ శత్రుదేశం కాదని చెప్పుకొచ్చాడు.
అఫ్రిది వ్యాఖ్యలపై కనేరియా స్పందిస్తూ... ‘భారత్ మన శత్రుదేశం కాదు. మతం పేరుతో ప్రజలను విడగొడుతున్నవాళ్లు మన శత్రువులు. ఒకవేళ భారత్ ను మన (పాక్) శత్రుదేశంగా భావిస్తే ఆ దేశ మీడియా ఛానెల్ తో నువ్వు సంప్రదించకు...’ అని రాసుకొచ్చాడు.
అంతేగాక.. పాక్ జట్టులో అఫ్రిది తన పై మతం మారాలని ఒత్తిడి చేసినప్పుడు అలా చేయకుంటే తన కెరీర్ ను నాశనం చేస్తామని కూడా బెదిరించారని కనేరియా తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
గతంలో కనేరియా చేసిన వ్యాఖ్యలకు మూడు రోజుల క్రితం అఫ్రిది స్పందిస్తూ.. ‘కనేరియా నాకు సోదరుడి వంటి వాడు. అయితే చీప్ పబ్లిసిటీ సంపాదించి డబ్బులు సంపాదించాలనే తలంపుతో ఏది పడితే అది వాగుతున్నాడు. నన్ను అబద్దాల కోరు అని, క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నేను అతడిపై ఏదైనా వివక్షా పూరితంగా వ్యవహరించి ఉంటే.. చెడుగా ప్రవర్తిస్తే అప్పుడే పీసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? అతడు మన శత్రు దేశం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ మత చిచ్చు రగిలిస్తున్నాడు..’ అని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కనేరియా పై విధంగా పేర్కొన్నాడు.
అంతకుముందు కనేరియా భారత్ కు చెందిన ఓ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. మేమిద్దరం (అఫ్రిది, కనేరియా) కలిసి ఆడినప్పుడు అతడు నన్ను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. పదే పదే దాని గురించి మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. నా మతాన్ని నేను నమ్ముకున్నాను. దానివల్ల నా క్రికెట్ కెరీర్ కు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. నా ఆట నేను ఆడాను..’ అని తెలిపాడు.
హిందూను అవడం వల్లే జట్టులొ తాను ఇబ్బందులు ఎదుర్కున్నానని కనేరియా గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అఫ్రిది.. తాను సారథిగా (వన్డేలకు) ఉన్నప్పుడు తనను ఎక్కువగా బెంచ్ కే పరిమితం చేసేవాడని, జట్టులో చోటు దక్కకుండా చేయడానికి చాలా కుట్రలు చేశాడని కనేరియా గతంలో పలు మార్లు వ్యాఖ్యానించి ఈ వివాదానికి బీజాలు నాటాడు.