IPL2022 CSK vs PBKS: చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి... పంజాబ్ కింగ్స్‌కి రెండో విజయం...

Published : Apr 03, 2022, 11:15 PM IST
IPL2022 CSK vs PBKS: చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి... పంజాబ్ కింగ్స్‌కి రెండో విజయం...

సారాంశం

126 పరుగులకి చెన్నై సూపర్ కింగ్స్ ఆలౌట్... హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన శివమ్ దూబే... 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం...

ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ కొట్టింది. అయితే విజయాల్లో కాదు, పరాజయాల్లో! ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా, మొదటి మూడు మ్యాచుల్లోనూ ఘోర ఓటములను చవిచూశాడు... మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ రెండో విజయాన్ని అందుకుంది. 18 ఓవర్లలో 126 పరుగులకి ఆలౌట్ అయిన సీఎస్‌కే, 54 పరుగుల తేడాతో ఓడింది.

181 పరుగుల లక్ష్యఛేదనలో సీఎస్‌కేకి ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 బంతుల్లో 1 పరుగు చేసిన కగిసో రబాడా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రాబిన్ ఊతప్పని అవుట్ చేసిన వైభవ్ అరోరా, మొయిన్ ఆలీని డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు...

21 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అంబటి రాయుడు, ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా 3 బంతులాడి, యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సీఎస్‌కే. గత మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయిన శివమ్ దూబే, 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన శివమ్ దూబే, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాతి బంతికే డీజే బ్రావోని రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు లివింగ్‌స్టోన్. అప్పటికే సీఎస్‌కే ఆఖరి 5 ఓవర్లలో 83 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. వస్తూనే సిక్స్ బాదిన ప్రెటోరియస్, 4 బంతుల్లో 8 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాతి బంతికి క్రిస్ జోర్డాన్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన సీఎస్‌కేకి అనుకూలంగా ఫలితం దక్కింది. 22 బంతులాడిన తర్వాత సిక్సర్ బాదిన ఎమ్మెస్ ధోనీ, 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అదే ఓవర్‌లో క్రిస్ జోర్డాన్‌ను అవుట్ చేసిన రాహుల్ చాహార్, చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌కి తెరదింపాడు. రాహుల్ చాహార్‌కి 3 వికెట్లు దక్కగా వైభవ్ అరోరా, లివింగ్‌స్టోన్ రెండేసి వికెట్లు తీశారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మయాంక్ అగర్వాల్, రెండో బంతికి రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన భనుక రాజపక్ష, తర్వాతి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

బంతిని ఆపిన క్రిస్ జోర్డాన్, వికెట్లకు దూరంగా త్రో విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. మాహీ వికెట్లను పడగొట్టే సమయానికి క్రీజుకి అడుగు దూరంలో ఉన్న రాజపక్ష, నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది...


అయితే రాజపక్షను అవుట్ చేసిన ఆనందం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి వస్తూనే ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, 5వ ఓవర్‌లో 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 6వ ఓవర్‌లో శిఖర్ ధావన్ కూడా బ్యాటు ఝులిపించి రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్... 

రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు జారవిడిచాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, 7 ఓవర్లు ముగిసే సమయానికి 72/2 పరుగులకి చేరుకోవడం విశేషం. 

శిఖర్ ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 95 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అంబటి రాయుడుకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ 17 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి ప్రెటోరియస్ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ హిట్టర్ షారుక్ ఖాన్ 11 బంతుల్లో 6 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఓడియన్ స్మిత్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 

ఒకానొక దశలో ఈజీగా 200+ స్కోరు చేసేలా కనిపించిన పంజాబ్ కింగ్స్, వరుస వికెట్లు కోల్పోయి పరుగులు చేయలేకపోయింది. 13 ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్యలో 5 ఓవర్లలో కేవలం 33 పరుగులే రాబట్టిన పంజాబ్ కింగ్స్, 3 వికెట్లు కోల్పోయింది. 

రాహుల్ చాహార్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, ఆఖరి 10 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు