
ఐపీఎల్ 2022 సీజన్‌లో వింటేజ్ ధోనీ సూపర్ షో నడుస్తోంది. సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, సీఎస్‌కే నాన్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే...
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి, మెరుపులు మెరిపించిన ఎమ్మెస్ ధోనీ... పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మ్యాజిక్ రనౌట్ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది...
ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మయాంక్ అగర్వాల్, రెండో బంతికి రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన భనుక రాజపక్ష, తర్వాతి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
బంతిని ఆపిన క్రిస్ జోర్డాన్, వికెట్లకు దూరంగా త్రో విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. మాహీ వికెట్లను పడగొట్టే సమయానికి క్రీజుకి అడుగు దూరంలో ఉన్న రాజపక్ష, నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది...
40 ఏళ్లు దాటినా క్రీజులో చిరుతలా కదులుతూ, మెరుపు వేగంతో రనౌట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది కచ్ఛితంగా మాహీకి చాలా స్పెషల్‌గా మిగిలిపోతుందని అంటున్నారు ధోనీ ఫ్యాన్స్...
మహేంద్ర సింగ్ ధోనీకి ఇది టీ20 కెరీర్‌లో 350వ మ్యాచ్ కావడం మరో విశేషం. రోహిత్ శర్మ (372) తర్వాత 350+ టీ20 మ్యాచులు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ.
రాజపక్షను అవుట్ చేసిన ఆనందం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి వస్తూనే ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, 5వ ఓవర్‌లో 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 6వ ఓవర్‌లో శిఖర్ ధావన్ కూడా బ్యాటు ఝులిపించి రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...
రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు జారవిడిచాడు. రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు జారవిడిచాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, 7 ఓవర్లు ముగిసే సమయానికి లివింగ్ స్టోన్ వీర బాదుడు కారణంగా 72/2 పరుగులకి చేరుకోవడం విశేషం.