
కెప్టెన్లు మారుతున్నా పంజాబ్ కింగ్స్ ఆటతీరులో మాత్రం మార్పు రావడం లేదు. 9.5 ఓవర్లు ముగిసే సమయానికి 109/2 పరుగులు చేసిన జట్టు, 20 ఓవర్లు ముగిసే సమయానికి 220+ స్కోరు ఈజీగా దాటుతుందని అనుకుంటారెవ్వరైనా. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. గత మ్యాచ్‌లో 210 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ముందు 181 పరుగుల టార్గెట్ పెట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది... ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మయాంక్ అగర్వాల్, రెండో బంతికి రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన భనుక రాజపక్ష, తర్వాతి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
బంతిని ఆపిన క్రిస్ జోర్డాన్, వికెట్లకు దూరంగా త్రో విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. మాహీ వికెట్లను పడగొట్టే సమయానికి క్రీజుకి అడుగు దూరంలో ఉన్న రాజపక్ష, నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది...
అయితే రాజపక్షను అవుట్ చేసిన ఆనందం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి వస్తూనే ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, 5వ ఓవర్‌లో 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 6వ ఓవర్‌లో శిఖర్ ధావన్ కూడా బ్యాటు ఝులిపించి రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...
రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు జారవిడిచాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, 7 ఓవర్లు ముగిసే సమయానికి 72/2 పరుగులకి చేరుకోవడం విశేషం.
శిఖర్ ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 95 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అంబటి రాయుడుకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ 17 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి ప్రెటోరియస్ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ హిట్టర్ షారుక్ ఖాన్ 11 బంతుల్లో 6 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఓడియన్ స్మిత్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
ఒకానొక దశలో ఈజీగా 200+ స్కోరు చేసేలా కనిపించిన పంజాబ్ కింగ్స్, వరుస వికెట్లు కోల్పోయి పరుగులు చేయలేకపోయింది. 13 ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్యలో 5 ఓవర్లలో కేవలం 33 పరుగులే రాబట్టిన పంజాబ్ కింగ్స్, 3 వికెట్లు కోల్పోయింది.
రాహుల్ చాహార్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, ఆఖరి 10 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది.